కరీమాబాద్ మే 5 : సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య అన్నారు. సోమవారం సీపీఎం పార్టీ వరంగల్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు కారల్ మార్క్స్ 207వ జన్మదినం సందర్భంగా మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో సామాజిక అసమానతలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు.
సోషలిస్టు దేశాలలో మార్క్సిజం ఆధారంగా ఆకలి, దారిద్రం, దోపిడీ, అణిచివేత లేకుండా వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి, రంగాలలో మిగతా దేశాల కన్నా సోషలిస్టు దేశాలలో మంచి పరిపాలన అందుతుందన్నారు. మహిళల హక్కులు పూర్తిగా రక్షించబడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కులాల పేరిట, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని విమర్శించారు. విద్య వైద్యం సామాన్య ప్రజలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్స్‌గా కుదించి కార్పొరేట్లకు, యాజమాన్య వర్గాలకు వత్తాసు పలికే విధంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ వాస్తవాలను గ్రహించి భవిష్యత్తులో పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, ఈసంపెల్లి బాబు, జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు, నలిగంటి రత్నమాల, కోరబోయిన కుమారస్వామి, బోళ్ల సాంబయ్య, నమిండ్ల స్వామి, హనుమకొండ శ్రీధర్, ఆరూరి కుమార్, వలదాసు దుర్గయ్య, పరికి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.