‘వ్యవసాయం దండుగ’ అన్న ముఖ్యమంత్రి ఒకరు..
‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే రాజ్యమేలుతాయ’న్న ముఖ్యమంత్రి మరొకరు..
మన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను అక్రమంగా తరలించుకు పోయి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి మరొకరు..
మొత్తంగా గోతి కాడి నక్కల్లా తెలంగాణను పీల్చిపిప్పి చేస్తున్నవారి కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన చారిత్రక ఘట్టం పూర్తవగానే మరో యజ్ఞానికి అంకురార్పన జరిగింది. 2018 జనవరి ఒకటి నుంచి అన్నదాతకు కరెంటు కష్టాల నుంచి విముక్తి లభించింది.రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రగతిని పూర్తిగా మార్చేసే అనూహ్య నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో అమలైంది. రైతులకు కొత్త సంవత్సర కానుకగా సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా మొదలై నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ యజ్ఞంతో సేద్యరంగం విప్లవాత్మక మార్పులకు లోనయింది. రాష్ట్రంలో వ్యవసాయం.. కరెంటు గురించి మాట్లాడాలంటే.. ‘కేసీఆర్ పాలనకు ముందు.. తర్వాత’ అనే పరిస్థితి వచ్చింది.
హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 31 : ఐదేళ్ల క్రితం వరకు వర్షాధారంగా మాత్రమే పంటలు పండించే తెలంగాణ ప్రాంతానికి కాకతీయులు నిర్మించిన చెరువులు ప్రధాన ఆయువుపట్టుగా నిలిచాయి. కానీ, వర్షాలు లేక, సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడు లేక సేద్యం మొత్తం కునారిల్లింది. ఆ తర్వాత చిన్నచిన్న బావులు తవ్వి మోటకొట్టి కొద్దిమేర సాగును రైతులు పెంచుకున్నారు. మోటల స్థానంలో ఆయిల్ ఇంజిన్లు ఆ తర్వాత విద్యుత్ మోటర్లు అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొదలైన విద్యుత్ విస్తరణ పనులు దశాబ్దాలు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సాగింది. 2014 వరకు తెలంగాణ రాక మునుపు కేవలం వ్యవసాయానికి 4గంటల నుంచి 6గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది.
అది కూడా పగలు కొంత.. రాత్రి కొంత గుడ్డిగుడ్డిగా వచ్చేది. రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు, పాము కాట్లకు గురై అనేకమంది రైతులు ప్రాణాలు విడిచారు. నక్సలైట్ల ఉద్యమం నడిచిన సమయంలో రైతులను కూడా రాత్రిపూట నక్సలైట్లుగా భావించి పోలీసులు కాల్చిచంపిన దుర్ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితులు.. కమ్ముకున్న కారు చీకట్ల నుంచి 2018 జనవరి ఒకటి అర్ధరాత్రి (2017 డిసెంబర్ 31) నుంచి అన్నదాతకు విముక్తి లభించింది. రాష్ట్రంలో వ్యవసాయరంగం ప్రగతిని పూర్తిగా మార్చేసే చారిత్రాత్మక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారు. రైతులకు కొత్త సంవత్సర కానుకగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా మొదలై నేటికి ఐదేళ్లు పూర్తయింది.
ఎన్పీడీసీఎల్ పరిధిలో భారీ మార్పులు
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) వరంగల్ కేంద్రంగా టీఎస్ఎన్పీడీసీఎల్ (తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) పని చేస్తున్నాయి. అయితే మెజార్టీ వ్యవసాయరంగం మొత్తం ఎన్పీడీసీఎల్ పరిధిలోనే ఉంటుంది. దీంతో దీని పరిధిలో వ్యవసాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రత్యేక దృష్టిపెట్టిన ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అనేక మార్పులు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది.
మహాయజ్ఞం కోసం పెద్ద ఎత్తున పనులు
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఐదేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. 33/11 విద్యుత్ సబ్స్టేషన్లు గతంలో 1,281 మాత్రమే ఉండగా కేవలం ఐదేళ్లలోనే కొత్తగా 197 నిర్మించారు. 33 కిలోవాట్ల విద్యుత్ లైన్‌ను 1561 కిలోమీటర్ల మేర, 11 కిలోవాట్ల విద్యుత్ లైన్‌ను 12,653 కిలోమీటర్ల మేర వేశారు. లో టెన్షన్(ఎల్టీ) విద్యుత్ లైనును 47,841 కిలోమీటర్ల దాకా వేశారు. ఐదేళ్లలో పాత లైన్‌తో పోల్చితే 36 శాతం పెరుగుదల ఉంది. 63 కిలోవాట్ విద్యుత్ లైన్ 745 కిలోమీటర్ల మేర వేసి 48,402 విద్యుత్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను, 175 పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. సోలార్ ఎనర్జీని కూడా అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది కొరత లేకుండా సంస్థలో 3,414 ఖాళీలకు గాను 3,133 మందిని అన్ని స్థాయిల్లో నియమించారు.
కేసీఆర్ దిశానిర్దేశంతోనే మహాకార్యం
సంస్థ నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను రైతులకు కావాల్సిన మేరకు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతోనే ఈ మహాకార్యం సాధ్యమైంది. ఇది సక్రమంగా కొనసాగాలంటే రైతులంతా సంస్థకు సహకరించాలి. వ్యవసాయ బావుల వద్ద నాణ్యమైన పరికరాలను మాత్రమే వాడాలి. అసెంబుల్డ్ మోటర్లు కాకుండా మంచి కంపెనీ మోటర్లను మాత్రమే వినియోగించాలి. అవసరమున్నంత మేరకే విద్యుత్ మోటర్లు నడపాలి. కొందరు రైతులు నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గుతుందని తెలిసినా నిర్ల్యక్షంతో మోటర్లను బంద్ చేయడం లేదు. ఒక్క యూనిట్ విద్యుత్‌ను రైతులకు అందించాలంటే ప్రభుత్వం 8 రూపాయలను వెచ్చిస్తుందని గమనించాలి. సాధ్యమైనంత వరకు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోవాలి. అక్రమంగా విద్యుత్‌ను వాడొద్దు. ఇప్పుడు సంస్థలో ఖాళీలు లేకుండా సిబ్బందిని నియమించాం. ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలు తలెత్తితే సొంతంగా పనులు చేయకుండా మా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
– అన్నమనేని గోపాల్‌రావు, చైర్మన్, ఎన్పీడీసీఎల్
మూడు రెట్లు పెరిగిన సాగు భూమి
ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన చెరువుల అభివృద్ధితో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా ఉబికి వచ్చాయి. బావులు, బోర్లలో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ నీటిని వాడుకునేందుకు విద్యుత్ సరఫరా అనివార్యమైంది. ఈ తరుణంలోనే వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్ అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం, అమలు వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో అన్నదాతలు వెనుదిరిగి చూడలేదు. సేద్యంలో విప్లవం సృష్టించారు. రాష్ర్టాన్ని దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 2018 కంటే ముందు కేవలం 27 లక్షల ఎరకాల సాగుభూమి మాత్రమే ఉండేది. కేవలం ఐదేళ్లలో సాగు భూమి కాస్త 94లక్షల ఎకరాలకు చేరుకుంది.
ఈ గణాంకాలు చూస్తే వ్యవసాయంలో విద్యుత్ ప్రాధాన్యం ఏమేరకు పెరిగిందో అర్థమవుతుంది. వరికి 16 శాతం, మక్కకు 20 శాతం అధికంగా విద్యుత్ వినియోగం పెరిగింది. గతంలో ప్రతి యాసంగి సీజన్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు రోజూ రోడ్లెక్కి ధర్నాలు చేసేవారు. ఈ ఐదేండ్లలో విద్యుత్ కోసం ఒక్కరోజు కూడా ధర్నా, రాస్తారోకో అన్న మాటే లేదు. విద్యుత్ అందక ఏ ఒక్క రైతుది గుంట కూడా ఎండిపోయినట్లు రికార్డుకు రాలేదు. డిమాండ్ సైతం రికార్డు స్థాయిలో డిసెంబర్లోనే 4,905 మిలియన్ యూనిట్లకు చేరింది.
ఎస్పీఎం సెంటర్లకు తగ్గిన పని భారం
ఎన్పీడీసీఎల్ పరిధిలో 2018 కంటే ముందు మొత్తం 2లక్షల 66వేల 213 ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి. వీటి రిపేరు కోసం 100 స్పెషల్ మెయింటెనెన్స్ (ఎస్పీఎం) ఉండేవి. ఈ సెంటర్లలో సిబ్బంది డీటీఆర్‌ల రిపేరు కోసం నానా తిప్పలు పడేవారు. పగలు రాత్రి తేడా లేకుండా పని చేసేవారు. అయినా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను రైతులకు సకాలంలో అందించడం వీలు కాకపోయేది. కేవలం రిపేరు కోసమే ఎమ్మెల్యేలు, మంత్రులతో పైరవీలు చేసుకునే దుస్థితి ఉండేది. ఇప్పుడు సంస్థ పరిధిలో 18 శాతం ట్రాన్స్ఫార్మర్లు పెరిగి ఈ సంఖ్య 3లక్షల 14 వేల 615కు చేరుకుంది. దీని ప్రకారం పాత పద్ధతిలో చూస్తే 150 వరకు ఎస్పీఎంలు ఉండాలి. అయితే సంస్థ పరిధిలో ఇప్పుడు 108 ఎస్పీఎంలు పని చేస్తున్నాయి. ఇందులో పని సిబ్బంది కూడా గతంలో మాదిరి కాకుండా ఒత్తిడి లేకుండా పని పూర్తి చేస్తున్నారు. అంతకు ముందు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నానా ఇబ్బందులు అయ్యేవి. ఇప్పుడు రైతు ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు అలా కొత్త కనెక్షన్ మంజూరు చేస్తున్నారు. గతంలో సంస్థ పరిధిలో 10 లక్షల 95 వేల 266 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే కేవలం ఐదేండ్లలో ఆ సంఖ్య 12లక్షల73వేల346కు చేరుకుంది. 15 శాతం పెరుగుదల కనిపించింది.