అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు మరో నాలుగు కొత్త 108 వాహనాలను సమకూర్చింది. నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, పర్వతగిరి కేంద్రంగా ఈ అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం వాహనాల సంఖ్య పదకొండుకు చేరగా, గత సంవత్సరం 17,013 మంది అత్యవసర వైద్య సేవలను వినియోగించుకున్నారు. అలాగే వరంగల్ సీకేఎం హాస్పిటల్‌కు నవజాత శిశువు సంరక్షణ వెహికల్, పార్థీవదేహాల తరలింపు కోసం ఎంజీఎం దవాఖానకు మరో వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది.
– వరంగల్, సెప్టెంబర్ 29(నమస్తేతెలంగాణ)
వరంగల్, సెప్టెంబర్ 29(నమస్తేతెలంగాణ) : అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతున్నది. సూపర్ స్పెషాలిటీ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న బాధితులను దవాఖానలకు తరలించడానికి 108 సేవలను మరింత విస్తృతం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన తల్లితో పాటు బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వాహనాలను సమకూరుస్తున్నది. చివరకు సర్కారు దవాఖానలో చనిపోయిన వారి పార్థీవదేహాలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి వాహనాలను కూడా అందుబాటులోకి తెస్తున్నది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం జిల్లాకు నాలుగు కొత్త అంబులెన్స్‌లను కేటాయించింది.
ప్రస్తుతం జిల్లాలో పదకొండు అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు 108 వైద్య సేవలను అందిస్తున్నది. వరంగల్ రైల్వే స్టేషన్, మట్టెవాడ ఫైర్ స్టేషన్, ఉర్సు కేంద్రంగా అంబులెన్స్‌లు నగర ప్రజలకు అత్యవసర వైద్య సేవలందిస్తున్నాయి. నర్సంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లో ఒక్కో అంబులెన్స్ పనిచేస్తున్నది. పేషంట్ల వద్దకు వేగంగా చేరుకోవడానికి, రెస్పాన్స్ టైం తగ్గుదల, ప్రాథమిక చికిత్సను అందించటమే టార్గెట్‌గా ఆయా మండలంలో డైనమిక్ హాట్ స్పాట్‌ను గుర్తించి, 108 వైద్య సేవల అధికారులు ఈ అంబులెన్సులను వినియోగిస్తున్నారు. నమోదవుతున్న సేవలను పరిగణలోకి తీసుకుని జీపీఎస్ ఆధారంగా డైనమిక్ హాట్ స్పాట్లను గుర్తిస్తున్నారు. ఆయా అంబులెన్సులోని వైద్య సిబ్బంది రెండు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
108 అంబులెన్సుల ద్వారా జిల్లాలో ఏటా వేలాది మంది అత్యవసర వైద్య సేవలను పొందుతున్నారు. 2017-18లో 14,176 మందికి, 2018-19లో 13,335 మందికి, 2019-20లో 12,959 మందికి, 2020-21లో 10,868 మందికి, 2021-22లో 12,731 మందికి, 2022-23లో 17,013 మందికి సేవలందించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ వెల్లడించారు. ఆగస్టులో వచ్చిన నాలుగు కొత్త అంబులెన్స్‌లు నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
నవజాత శిశువు సంరక్షణ వెహికిల్..
నవజాత శిశువు సంరక్షణ కోసం ప్రభుత్వం కొత్తగా జిల్లాకు ఒక అంబులెన్స్‌ను మంజూరు చేసింది. దీన్ని వరంగల్‌లోని సీకేఎం దవాఖానకు కేటాయించింది. ప్రభుత్వ విధానాలతో సీకేఎం హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య పెరిగినందున ప్రభుత్వం నవజాత శిశువు సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఇచ్చింది. అలాగే వరంగల్ ఎంజీఎం దవాఖానకు ప్రభుత్వం మరో పార్థీవదేహం వాహనం (హర్సె వెహికిల్)ను కేటాయించింది. గతంలో ఈ హాస్పిటల్‌కు పార్థీవదేహం వాహనం ఒకటి ఉంది. ఎంజీఎం నుంచి పార్థీవదేహాలను సొంతూరుకు చేర్చడానికి ఒకటి సరిపడకపోవడంతో ప్రభుత్వం మరో వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పార్థీవదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లడం ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో సీఎం కేసీఆర్ ఇటీవల పార్థ్థీవదేహాల వాహనాల సేవలను మరింత విస్తృతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పుడు ఎంజీఎం దవాఖాన కేంద్రంగా రెండు పార్థ్థీవదేహం రవాణా వెహికిల్స్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.