Mahabubabad | కురవి, జూన్ 21: అన్నను చంపిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ సీరోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18న సీరోలు మండల కేంద్రంలో అన్నను తమ్ముళ్లు చంపిన కేసును సీరోలు పోలీసులు చేధించినట్లు తెలిపారు. సీరోలుకు చెందిన 75 ఏళ్ల వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ముగ్గురు కుమార్తెలు.. సింగనబోయిన రమ, బండారి ప్రమీల, ఎల్లావుల లక్ష్మీ, కుమారుడు మృతుడు వల్లపు కృష్ణ ఉన్నారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత నర్సమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు వల్లపు మహేష్, వల్లపు నరేష్ లు ఉన్నారు. తండ్రి లింగయ్యకు గ్రామంలో 16 ఎకరాల భూమి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇద్దరి భార్యల కుమారులకు సమానంగా భూమిని పంచి ఇచ్చాడు. అప్పటి నుంచి రెండో భార్య కుమారులు తమకు తక్కువ భూమి ఇచ్చావని తండ్రితో గొడవపడుతున్నారు. గత 16 సంవత్సరాలుగా భూమి విషయంలో తరచూ తండ్రితో రెండో భార్య కుమారులు గొడవపడుతున్నట్లు వివరించారు.
ఈనెల 18న వల్లపు లింగయ్య, పెద్ద భార్య కొడుకు కృష్ణ, అల్లుడు ఎల్లావుల గోపాల్ రావులు పొలాన్ని దున్నుతుండగా వల్లపు నరేష్ వచ్చి పొలం దున్నవద్దని గొడవపడ్డట్లు తెలిపారు. గొడవ పెట్టుకున్న నరేష్ ఇంటికి వెల్లిపోయి భార్య సౌందర్య, తల్లి నర్సమ్మలకు చెప్పి అన్నయ్య వల్లపు మహేష్, కాంపల్లి గ్రామానికి చెందిన నున్న వీరన్నలను తీసుకుని వచ్చి వల్లపు కృష్ణ, వల్లపు లింగయ్యలతో గొడవపడి కత్తితో వల్లపు కృష్ణను పొడిచినట్లు, తండ్రి లింగయ్య అడ్డుపోతే కత్తితో గాయపరిచినట్లు తెలిపారు. వీళ్లను చంపితేనే పొలం మాకొస్తుందని వల్లపు నరేష్, వల్లపు మహేష్, పల్లపు నర్సమ్మ, వల్లపు సౌందర్య, నున్న వీరన్నలు వల్లపు కృష్ణను అడ్డుతొలగిస్తే ఆస్తి మొత్తం దక్కించుకోవచ్చనే కుట్రతో వల్లపు కృష్ణను కత్తితో తమ్ముడు నరేష్ పొడిచి చంపినట్లు తెలిపారు. శనివారం ఉదయం సీరోలు శివారులో సత్యమాత ఆలయం వద్ద వీరు హైదరాబాద్ కు వెళ్లేందుకు వల్లపు నరేష్, వల్లపు నర్సమ్మ, వల్లపు సౌందర్య, నున్న వీరన్నలు సిద్ధంగా ఉండగా సీరోలు ఎస్సై నగేష్ తన సిబ్బందితో పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ కృష్ణకిషోర్ వివరించారు. ఈ నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచినట్లు తెలిపారు. కేసులో ఉన్న వల్లపు మహేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసును చేధించిన మరిపెడ సీఐ రాజ్ కుమార్, సీరోలు ఎస్సై నగేష్, సిబ్బందిని ఆయన అభినందించాడు. కత్తి, సెల్ ఫోన్, మోటర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆస్తుల కోసం హత్యలు చేస్తే ఆస్తులు దక్కవని, కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్, సీరోలు ఎస్సై నగేష్, సిబ్బంది ఉన్నారు.