దేవరుప్పుల, ఆగస్టు 5 : పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి కలెక్టర్ శివలింగయ్యతో మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్సై మునావత్ రమేశ్ తన బృందంతో వాగుకు మరోవైపు నల్లకుంట తండా మార్గంలో అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు తోడవడంతో వారిని రక్షించే ప్రయత్నంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెదమడూరు గ్రామంలో అత్యధిక మంది వ్యవసాయ క్షేత్రాలు వాగు అవతలనే ఉన్నాయి.
ప్రతి రోజూ వాగుదాటితేనే వ్యవసాయ పనులు సాగేది. 15 రోజుల నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా పనులు చేయడానికి రైతులు, కూలీలు, గీత కార్మికులు వాగు నీటిలో ఈదుకుంటూ పోతూ ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం పెదమడూరు గ్రామానికి చెందిన అనేక మంది వాగుదాటి రాగా రైతులు చౌడబోయిన యాదగిరి, బోనగిరి పెద్దులు, గీత కార్మికులు అంతటి సోమయ్య,అంతటి యాకయ్య రాత్రి పొద్దుపోయిన అనంతరం వాగు దాటి వస్తున్నారు. సగం వాగు దాటగానే వరద ఉధృతి పెరగడంతో దాటలేని పరిస్థితి ఏర్పడడంతో వాగులోనే ఉన్న ఓ తాటి చెట్టును ఆసరాగా చేసుకుని ఆ నలుగురు ఉన్నారు. ఈ విషయం ఇటు పెదమడూరు, మరోవైపు ఉన్న నల్లకుంట వాసులకు తెలియడంతో వారిని రక్షించే ప్రయత్నం చేశారు.
నలుగురు సురక్షితం..
వాగులో చిక్కుకున్న ఆ నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, పాలకుర్తి సీఐ చేరాలు, దేవరుప్పుల ఎస్సై రమేశ్ వాగు ఒడ్డుకు చేరి తాడు సాయంతో ఓ వ్యక్తిని నలుగురు చిక్కుకున్న స్థలానికి పంపగా మొదటగా ఆ నలుగురిని తాడు సాయంతో ఒడ్డుకు చేర్చి తానూ ఒడ్డుకు చేరడంతో కథ సుఖాంతమైంది. దేవరుప్పుల మండల పరధిలో పారుతున్న వాగు చరిత్రలో ఇది మొదటి సంఘటన కాగా సురక్షితంగా వారు బయటకు రావడంతో పెదమడూరు గ్రామస్తులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. రక్షించిన వారిలో నల్లకుంట తండా సర్పంచ్ బానోతు రాజన్న ఉండగా తాడుతో వారి దగ్గరికి పోయిన వారిలో అంతటి శ్రీను ఉన్నారు. ఈ కార్యక్రమంలో పెదమడూరు ఉప సర్పంచ్ మానుపాటి వెంకన్న, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తీగల దయాకర్, బస్వ మల్లేశ్, ఊడుగు సందీప్ తదితరులు ఉన్నారు.