 
                                                            హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 31: జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అత్యాధునిక ఓపెన్ ఎయిర్ అంపైథియేటర్ నిర్మాణానికి నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి నిట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ పి.రతీష్కుమార్, హాజరయ్యారు. సీపీడబ్ల్యూడీ ద్వారా అమలు చేయబోయే ఈ అంపైథియేటర్ ప్రాజెక్ట్ సంస్థ సాంస్కృతిక, మౌలిక వసతుల రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, సుమారు రూ.24.40 కోట్లు వ్యయంతో 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తికానుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. 2,500 మంది కూర్చునే సామర్థ్యంతో పాటు రెండు ఆర్ట్ గ్యాలరీలు, ఒక మల్టీపర్పస్ హాల్ కూడా ఇందులో ఉంటాయని, ఇది సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యాకార్యక్రమాలు, కమ్యూనిటీ సమావేశాలకు అనువైన వేదికగా ఉంటుందన్నారు.
సృజనాత్మకత, సహకారం, క్యాంపస్ ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రూపొందించబడిన ఈ కొత్త అంపైథియేటర్ విద్యార్థుల పరస్పర మేళవింపు, కళాత్మక వ్యక్తీకరణ, ప్రజాచర్చలకు కేంద్రంగా నిలవనుందన్నారు. క్యాంటీన్ (కేఫ్టీరియా) నిట్లో కొత్త క్యాంటీన్ నిర్మాణానికి డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది శంకుస్థాపన చేశారు. సీపీడబ్ల్యూడీ ద్వారా రూ.6.11 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లో పూర్తికానుందని, ఇందులో 350 సీట్ల డైనింగ్ హాల్, ఆధునిక వంటగది ఏర్పాటు చేయబడుతుందని బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఇది విద్యార్థులు, సిబ్బంది, సందర్శకులకు సౌకర్యవంతమైన, శుభ్రమైన, సమర్థవంతమైన భోజన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు.
 
                            