వర్ధన్నపేట, సెప్టెంబర్ 30 : రూరల్ ఏరియా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రాయపర్తిలో జరిగిన స్వర్ణభారతి మండల సమాఖ్య 14వ వార్షిక మహాసభకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. పలు మహిళా సంఘాలకు రూ.43 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో బస్టాండ్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన రూరల్ మార్టును ప్రారంభించారు. రూ.10 కోట్లతో ఆరు లైన్లకు ఎన్‌హెచ్ విస్తరణ, రూ.3 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక శక్తిని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో శనివారం ఉదయం రూ.10కోట్లతో ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ, రూ.3 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు పనులకు కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన స్వర్ణభారతి మండల సమాఖ్య 14వ వార్షిక మహాసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మహిళలు నిత్యం తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం 9 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ మిషన్‌భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మహిళా సంఘాలను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని బలోపేతం చేసి మహిళలకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారనారు. ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యువతులు, మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లను అందించినట్లు తెలిపారు. అంతేకాక కరోనా సమయంలో కూడా ట్రస్ట్ ద్వారా సేవలందించినట్లు ఆయన వివరించారు.
టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మొదటి దశ శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల దుస్తులను ఇప్పటికే మహిళలు కుడుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. అయినా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కంపెనీలతో మాట్లాడినట్లు చెప్పారు. త్వరలోనే సంగెం, తొర్రూరు కేంద్రాల్లో కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు మరింత నైపుణ్యం పెంచుకొని ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అంతేకాక మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి కుటీర పరిశ్రమల స్థాపనకు కూడా తనవంతుగా సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వివిధ బ్యాంకుల నుంచి మంజూరైన రూ.43 కోట్లకు సంబంధించిన చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే, పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు, గృహలక్ష్మి ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
రూరల్ మార్ట్ ప్రారంభం
స్వర్ణభారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన రూరల్ మార్ట్ట్ను మంత్రి దయార్‌రావు ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసిన ఆహార ఉత్పత్తులతో పాటు ప్రజలకు అవసరమైన వస్తువులను విక్రయించేందుకు ఈ రూరల్ మార్టును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాలకు చెందిన గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులను తయారు చేసి, రూరల్ మార్టులో విక్రయించుకోవాలని సూచించారు. దీనివల్ల సంఘం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందని వివరించారు.
కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మరు
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలను ప్రజలు ఏ మాత్రం నమ్మరని మంత్రి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఆ హామీలు అమలు కావడం లేదన్నారు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఈ హామీలను అమలు చేసి తెలంగాణకు వచ్చి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, మండల ప్రజాప్రతినిధులు, సెర్ఫ్ అధికారులు, మండల, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.