హనుమకొండ, మే 5 : పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఓ మాజీ సర్పంచ్ సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఆందోళనకు దిగాడు. ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నడికూడకు చెందిన మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు చేరుకున్నాడు. నేరుగా కలెక్టర్ ప్రావీణ్య వద్దకు వెళ్లి ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని వాదనకు దిగాడు. దీంతో అక్కడే ఉన్న పలువురు అధికారులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తాను బిల్లులు చెల్లించేంత వరకు ఇక్కడే ఉంటానని రవీందర్రావు మొండికేయడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి మేరకు అప్పుచేసి నడికూడ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టానని, సుమారు రూ. 40 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పులు తీర్చలేక కుటుంబం రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందన్నాడు. బిల్లులు అడిగితే పోలీసులతో బయటకు నెట్టివేయించడం, అరెస్ట్‌లు చేయడమే ప్రజా పాలనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు నా బాధ చెప్పుకుందామంటే పోలీసులతో బయటకు నెట్టివేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.