హనుమకొండ, సెప్టెంబర్ 9 : బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ విచారించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వద్ద ఉన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగిందని, నాలుగు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు.
పార్టీ మారిన సభ్యుల విషయంలో స్పీకర్ల నాన్చుడు ధోరణితో తీర్పు ఆలస్యం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఫిరాయింపుల చట్టం తెచ్చినా అందులోని లొసుగులతో పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్నో చట్ట సవరణలు తెచ్చినా ఈ చట్టాన్ని ఎందుకు సవరించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే మాటలు వినకుండా స్పీకర్ తన అధికారాన్ని వినియోగించుకొని విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలోని అని రాజకీయ పార్టీలు పట్టుబట్టి 10వ షెడ్యూల్ రద్దు చేయించాలన్నారు. స్పీకర్ 4 నుంచి 6 వారాల్లో నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం వెంటనే 10వ షెడ్యూల్ రద్దు చేయకుంటే ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోతారన్నారు. అన్యాయం జరిగితే తిరుగుబాటు తప్పదు ప్రజాకవి కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాకారమైందని.. రాష్ర్టానికి అన్యాయం జరిగితే మరో తిరుగుబాటు తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు.
హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మహనీయులకు గుర్తింపు తెచ్చారన్నారు. వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. కాళోజీ తెలుగు భాషకు ఎనలేని సేవచేశారని, తుది శ్వాస వరకు దాని అభివృద్ధి కోసం కృషి చేశారన్నా రు. ఆయన స్ఫూర్తితో అన్యాయంపై పోరాడాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో చైతన్య గళం వినిపించారన్నారు. అనంతరం కాళోజీ జంక్షన్‌లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పలు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బొంగు అశోక్‌యాదవ్, బోయినపల్లి రంజిత్‌రావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నయీముద్దీన్, జానకీరాములు, వెంకన్న, పోలపల్లి రామ్మూర్తి పాల్గొన్నారు.