రేగొండ, జనవరి 6 : వరంగల్ వేదికగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం హామీలన్నీ వెంటనే అమలు చేయడంతో పాటు డీబీఎం-38 ద్వారా సాగునీరు విడుద ల చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం గోరికొత్తపల్లి, రేగొండ మండలకేంద్రాల్లో గంట పాటు రాస్తారోకో చేయడంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమందికే మాఫీ చేసిందని.. అలాగే రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఇప్పుడు 12వేలే అంటూ మరోసారి దగా చేసిందన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను వంచించి ఏ ఒక్కటీ అమలుచేయడం లేదన్నారు. క్వింటాల్‌కు రూ.500 బోనన్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు.
ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా.. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలకు నియామాక పత్రాలు అందజేసి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నద న్నారు. ఏడాది పాలనలో రాష్ట్రం మరింత వెనుకబడి పోయింద న్నారు. ఇప్పటికైనా హామీలన్నింటినీ అమలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటలు తప్పవని గండ్ర హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, హమీద్, నాయకులు ఇంగె మహేందర్, విద్యాసాగర్‌రెడ్డి, కొల్గూరి రాజేశ్వరా రవు, కొలిపాక భిక్షపతి, సామల పాపిరెడ్డి, లింగారెడ్డి, చంద్రాకర్రెడ్డి, నీలాంబరం ఉన్నారు.