హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న దృష్ట్యా, విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కేటీఆర్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్య్రమే అసలైన గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన ఉంటేనే మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులో కూడా మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.