గిరిజనం కోసం బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. మానుకోట మహాధర్నాపై సర్కారు ఉక్కుపాదం మోపడంతో కన్నెర్రచేశారు. లగచర్ల రైతుల సమస్యలపై గురువారం ధర్నాకు సిద్ధమవుతున్న తరుణంలో చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో భగ్గుమన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎస్పీ క్యాంపు ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తలొగ్గి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అక్కడే బైఠాయించి అటు ఎస్పీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలతో నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకునేందుకు రేవంత్ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని, హైకోర్టు అనుమతితో త్వరలో 50వేల మంది గిరిజనులతో మహాధర్నా చేస్తామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వెల్లడించారు.
– మహబూబాబాద్ రూరల్, నవంబర్ 20
లగచర్ల గిరిజనుల సమస్యలపై గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మానుకోటలో నిర్వహించనున్న మహాధర్నాకు ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్ అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయ క్, ఇతర నాయకులు, కార్యకర్తలు రాత్రి 7 నుంచి 11 గంటల వరకు ఎస్పీ క్యాంప్ ఆఫీ స్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి, ఎస్పీకి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కేటీఆర్ ధర్నా పిలుపుతో సీఎం రేవంత్‌రెడ్డిలో వణుకు పుట్టిందని, మానుకోటలో బీఆర్ఎస్ ధర్నా చేస్తే రాష్ట్రమంతటా ప్రజలు ఆందోళనలు చేపడతారనే భయంతో అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మహాధర్నాను తాత్కాలికంగా వాయి దా వేశామని, త్వరలోనే 50 వేల మందితో నిర్వహిస్తామని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆందోళనలో మున్సిపల్ చైర్మన్ రాంమోహన్‌రెడ్డి , వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్‌రెడ్డి, రఘు, వెంకన్న, మంగళంపల్లి కన్న, వేణు, రవికుమార్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కూడా హరించి వేస్తున్నది. సామరస్యంగా గిరిజన జాతి పైన జరిగిన దాడులను నిరసిస్తూ ధర్నా చేస్తామంటే అనుమతిని నిరాకరించారు. అనేక ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాల్లో పాల్గొనడం, ధర్నాలు చేయడం కొత్త కాదు. ప్రభుత్వం గిరిజన సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి.
-ఎమ్మెల్సీ రవీందర్రావు
మూడు రోజుల క్రితమనే మహాధర్నా ఉందని ఎస్పీ దృష్టికి తీసుకుపోయాం. తీరా సమయానికి అనుమతి నిరాకరించడం దారుణం. పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం డీజీపీ నుంచి ఒత్తిడి ఉందని, కేటీఆర్ ధర్నాకు అనుమతి ఇవ్వనని ఎస్పీ చెప్పటం సరైంది కాదు. ప్రజల సమస్యలపైన ధర్నా చేసే అధికారం ఎవరికైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులను నిర్బంధం చేసే పనిలో ఉంది. దానిని వెంటనే మానుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రజలకు రక్షణ లేకుండా రాజకీయ ముసుగులో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా కాకుండా ప్రజలకు రక్షకులుగా ఉండాలి.
– మాలోత్ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు
లగచర్ల గిరిజనులకు న్యాయం జరగాలని, మానుకోట జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని కేటీఆర్‌ను ఇక్కడి గిరిజన సంఘాల నాయకులు సంప్రదించడంతో మహాధర్నాకు పిలుపునిచ్చాం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎస్పీ దృష్టకి తీసుకెళ్తే పర్మిషన్ ఇస్తానని చెప్పారు. తీరా ధర్నా సమయానికి అనుమతి నిరాకరించడం దారుణం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదలకు చేసిందేమీలేదు.
-ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబాబాద్ ప్రాంతంలోని గిరిజన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్, ప్రభు త్వ విప్ రామచంద్రూనాయక్ గిరిజన ఓట్లతోనే గెలిచి వారి హక్కులను కాపాడడాన్ని విస్మరిస్తున్నారు. ఓట్లు వేసిన గిరిజనులు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖా యం. ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని ధ ర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దారు ణం. ఎస్పీ అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తాం. గ్రామాల్లో యువత లడాయికి సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి మొండి వైఖరి నశించాలి.
-మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్