కురవి, జూలై 13 : ఆర్డినెన్సు పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆధార్ కార్డు ఉంటేనే రైతులకు యూరియా బస్తా…లైన్ లలో చెప్పులు పెట్టుకునే పాత రోజుల దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను ఏవిధంగానైతే మోసం చేశాడో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆర్డినెన్సు పేరిట కొత్త నాటకం ఆడుతున్నారన్నారు.
ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను వంచించారని మండిపడ్డారు. అమలు కాని హామీలను ఇచ్చి ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారని గుర్తు చేశారు. ఇటీవల సీఎం డిప్యూటీ సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోటీశ్వరుల మాట దేవుడెరుగు ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తానన్న మాట మర్చిపోయారా అని గుర్తు చేశారు. చిత్తశుది ఉంటే 2500 అమలు చేయాలన్నారు. ఉమ్మడి పాలనలో పడ్డ రైతు కష్టాలు మళ్లీ కాంగ్రెస్ తెరమీద తీసుకువచ్చిందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడిగిన రైతుకు లేదనకుండా యూరియా సరఫరా చేసామని నేడు యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టుకునే దుస్థితికి రైతును దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లుగా ఉన్న సమయంలో పనులు చేసిన మాజీ సర్పంచులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వారి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, కురవి సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి, చిన్నం భాస్కర్, కొణతం విజయ్, బుడిగె లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.