స్టేషన్ ఘన్పూర్, అగస్టు 02 : సీఎం రేవంత్‌రెడ్డికి తొత్తుగా, కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని యెడల తన పదవికి రాజీనామ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు. శనివారం ఘన్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేవశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పిరాయింపుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశం అంతా చర్చ నడుస్తుందన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామ చేయకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే దేశ ద్రోహం కంటే ప్రమాదకరం అని రాజయ్య అన్నారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యెలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు. అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ
ఉంటే.. ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాలని, ఈ విషయంలో ముందుగా నేను కొడతానంటూ పలికిన మాటలు సీయం రేవంత్ రెడ్డికి గుర్తుండకపోవడం గమనర్హం అన్నారు.
కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారని, రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలువాలని సవాల్ విసిరారు. ఏకాకిగా మారిన కడియం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి నియోజకవర్గ కాంగ్రేస్ శ్రేణులకు దూరమై ఏకాకిగా మారాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, మాజీ సర్పంచ్ సురేష్, ఆకుల కుమార్, పార్శి రంగారావు, కుంభం కుమార్, మారపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, పెసరు సారయ్య, కనకం గణేష్, తాటికొండ అనిల్, హీరా సింగ్
తదితరులు పాల్గొన్నారు.