ధర్మసాగర్ : అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహరం అందించాలని, పత్తి పంటలకు ఎకరానికి రూ.లక్ష, వరి పంటలకు రూ.70వేలు పరిహరంగా చెల్లించాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం, నారాయణగిరి గ్రామాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల ఉసురు తీయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
రైతుల పక్షాన ఉండాల్సిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న వడ్లకు బోనస్ కాస్త భోగస్ గా మారిందన్నారు. రైతుల పరిస్థితి అత్యంత దౌర్భాగ్యంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి చిత్తశుద్ది లేదని, వరదలకు కొట్టుకపోయిన రోడ్లకు కనీసం మరమ్మతులు చేయడంలేదని విమర్శించారు. దేవునూర్ లో ఉన్న కడియం శ్రీహరి కి ఉన్న భూమిని కౌలుకు తీసుకున్న రైతుల నుండి మానవతాధృక్పథంతో కౌలు పైసలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహరం అందించాలని అన్నారు.
ధర్మసాగర్ రిజర్వాయర్ కింద ఉన్న కాలువను లోతు, వెడల్పు పెంచాలని, మరోకసారి రైతులకు ఇబ్బందులు కలగకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆనంతరం చేతికందిన పంట నీట మునిగేసరికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముందు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మోరె మహేందర్ ని పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నారాయణగిరి, ముప్పారం గ్రామంలో వరదలకు కొట్టుకపోయిన పంటలను పరిశీలించారు. నారాయణగిరి గ్రామానికి చెందిన మీస ప్రవీణ్ అనే రైతుకు చెందిన సూమారు రూ.2లక్షల విలువ గల రెండు పాడి ఆవులు, బుయ్య గారడీకి చెందిన సూమారు రూ. 8లక్షలు విలువ గల ఆరు బర్లు వర్షానికి మృత్యువాత చెందగా వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ కర్ర సోమిరెడ్డి, నాయకులు లక్క శ్రీనివాస్, లాల్ మహ్మద్ ప్రేమకుమార్, పుట్ట వెంకట్రాజం, స్వామి, రైతులు శివన్న, తదితరులు పాల్గొన్నారు.