మహాముత్తారం, నవంబర్ 23 : తెలంగాణ మాదిరిగానే మహారాష్ట్రలో పథకాలు అమలు చేస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు చీదరించుకున్నారని, కనీసం వారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలను నిరసిస్తూ శనివారం మహాముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నల్లబ్యాడ్జిలతో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయంటూ భారీ బహిరంగ సభ ఏర్పా టు చేసి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారని, ఏడాది కావస్తున్నా ఇంటి స్థలాలు, రూ. 5 లక్షలు మంజూరు చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని కోనంపేటలో 73 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు.
రేవంత్ సర్కారు ఆరు గ్యారెంటీలతోపాటు 420హామీల్లో ఏ ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశామని నిరూపిస్తే తాము కండువాలు తీసి కాంగ్రెస్ సంబురాల్లో పాల్గొంటామన్నారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తన నియోజకవర్గంలో ఏ ఒక పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు పనిచేస్తున్నారని, అలా చేస్తే భవిష్యత్ ఉండదన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజా వంచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పుట్ట మధు పిలుపునిచ్చారు.