నల్లబెల్లి, డిసెంబర్ 23: రాష్ట్రంలో పీఎం కిసాన్‌ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కారు కుటిల యత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపెట్టిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ఎదురు చూడకుండానే పంట పెట్టుబడి సాయం అందజేసిందని, ఇప్పటికే రెండు సార్లు రైతుబంధుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందన్నారు. కమిటీల పేరుతో ఐదుగురు మంత్రుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పంట పెట్టుబడిపై విధి విధానాలను ఖరారు చేయకపోవడం శోచనీయమన్నారు.
కేసీఆర్ సర్కారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8,89,700 పైచిలుకు రైతులకు రైతు బంధు ఇవ్వగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 3,81, 890 మంది రైతులకు రైతుబంధును కుదించే కుట్రలు సరైంది కాదన్నారు. జిల్లాలో 2.40 లక్షల టన్నుల ధాన్యం వస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 90 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయలేదో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామన్నా పీపీసీఈ సెంటర్లో రైతులు ఎందుకు విక్రయించలేదో స్పష్టం చేయాలన్నారు. ప్రధానంగా ప్రాంతీయ సహకార సంఘా లను నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి రైతుకు చెందిన అన్ని ఎకరాలకు రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు లేనిపోని సాకులతో ఒక్క పంటకు రైతు బంధు వేసి చేతులు దులుపుకుంటామంటే కాంగ్రెస్ సర్కారు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాకీ ఉన్న రెండు పంటలకు ఎకరానికి రూ. 15,000 లెక్కన రెండు విడు తలకు రూ. 30,000లు రైతు భరోసా బాకీని చెల్లించాకే స్థానిక ఎన్నికలకు పోవాలన్నారు.
లేదంటే కాంగ్రెస్ సర్కారును ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుందని హెచ్చరించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే నియోజకవర్గంలో విడుదల చేసిన రూ. 75 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయో సంబంధిత మంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, నాయకులు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, పాలెపు రాజేశ్వర్‌రావు, కొత్తపెల్లి కోటిలింగాచారి, గందె శ్రీనివాస్‌గుప్తా, రాజారాం, గుమ్మడి వేణు, మామిండ్ల మోహన్‌రెడ్డి, హింగ్లి శివాజీ పాల్గొన్నారు.