నల్లబెల్లి, నవంబర్ 11 : అన్నదాతలను నిలువుదోపిడీ చేయడమే ప్రజాపాలనా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లబెల్లిలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన 420 హామీలను అమలుచేయడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వానకాలంలో పంటలు సాగుచేసిన అన్నదాతలకు అతివృష్టి శాపంగా మారిందని.. ఈ పరిస్థితుల్లో వారికి రైతుబంధు విడుదల చేయకపోవడంతో పాటు పండిన కొద్దిపాటి పంటను మార్కెట్లో విక్రయించుకోలేని దుస్థితి నెలకొనడం కాంగ్రెస్ ప్రభుత్వ నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం 54 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగుచేస్తే ఒక క్రాప్‌లోనే రైతులు పత్తి పంటను తొలగించి అంతర పంటలు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పాడి తర్వాత పత్తిపైనే రైతులు ఆధారపడి ఉన్నారని, నేడు రేవంత్ సర్కారు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు పత్తి పంట తొమ్మిది క్వింటాళ్లు రావాల్సి ఉండగా కేవలం 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తుండడంతో పెట్టిన పెట్టుబడి రాక, తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆగమవుతుంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉంటే పండిన కొద్దిపాటి పంటను మార్కెట్లో విక్రయించుకోవాలంటే సీసీఐ కొనుగోళ్లను నిరాకరించడం సిగ్గుచేటన్నారు. అంతేగాక వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రైతులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేయాలని.. లేకపోతే కాంగ్రెస్ సర్కారును ప్రజాక్షేత్రంలో ఎండగట్టి రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నాయకులు కొడారి రవన్న, మోటూరి రవి, కుమారస్వామి, సట్ల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.