నర్సంపేట, మే6: పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక మూడున్నరేళ్ల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో తనను బ్యాంకర్లు చెప్పుల దొంగలాగా చూస్తున్నారని అభివర్ణించుకోవడం దురదృష్టకరమన్నారు. దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్న ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించి తన్నుకు చావండని సలహాలు ఇస్తున్నాడని ఆరోపించారు.
సీఎం చెప్పుల దొంగగా కనబడితే ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఎఫ్ఆర్బీఎం, కేంద్రప్రభుత్వం అనుమతితోనే అప్పులు చేశామని, దేశంలో మన కన్నా 28 రాష్ర్టాలు ఎక్కువగా అప్పులు చేశాయని, మిగతా రాష్ర్టాల్లో ఈ పరిస్థితి లేనప్పుడు మనకెందుకు వచ్చిందన్నారు. సీఎం మాటలు విన్నా క రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి పనులు చేయలేని పరిస్థితి ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ అమలు కూడా కష్టసాధ్యమేనన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, యు వ వికాసం, మహాలక్ష్మి, రైతు భరోసా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి తులం బంగా రం, పింఛన్ల పెంపులాంటి పథకాల అమలుపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. ఏమాత్రం పరిపాలన అనుభవం లేని సీఎం, మంత్రులకు రాష్ర్టా న్ని పాలించే అర్హత లేదని, వీరిపై రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
దేశంలోనే అత్యధిక జీడీపీని కలిగి, అత్యధికంగా జీఎస్టీ చెల్లించే స్థాయికి ఎదిగిన తెలంగాణను అప్పులు పుట్టని రాష్ట్రంగా మారిందని చెప్పడం రాష్ట్ర ప్రజల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని, వారి హక్కుల సాధనకు ప్రతిపక్షంగా బీఆర్ ఎస్ పార్టీ వెంట ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్ల ను తక్షణమే నెరవేర్చాలని ఆయన కోరారు. పెట్టుబడిదారులు రాష్ర్టానికి రాకుండా, ఉద్యోగాల కల్పన జరుగకుండా సీఎం వ్యాఖ్యలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.