శాయంపేట, సెప్టెంబర్ 3 : మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని కక్షపూరితంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేశారని, దీనిని తక్షణం రద్దు చేసి సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. యూరియా దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులు, కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఖండిస్తూ శాయంపేట మండలం మాందారిపేట జాతీయ రహదారిపై బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్ర పూరితంగా బద్నాం చేసేందుకు విడతల వారీగా కాళేశ్వరంను చూపెట్టి శాసనసభ సమావేశాలు పెట్టారన్నారు. ఘోష్ కమిషన్ అని వేశారని, అది ఓ చెత్త కమిషన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్టును తీసుకుని ముందుకు పోతూ అది చాలదన్నట్టు సీబీఐ విచారణ జరపాలని నిర్ణయిం చడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
మోడీ, రేవంత్‌రెడ్డి ఇద్దరు కలిసి కేసీఆర్ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వానికి నిరసనగా, కాళేళ్వరంపై సీబీఐ విచారణను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేపట్టామన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. యూరియా ఇవ్వని సర్కారును రైతులు మెడలు వంచుతారని, ఇప్పటికే రుణమాఫీ సగం కూడా కాలేదని, ప్రణాళిక లేకుండా సాగుతున్న ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఉన్నారన్నారు.
రైతులతో పెట్టుకున్నవాళ్లెవరు ముందుకు సాగలేదని ప్రభుత్వ మెడలు వంచి యూరియా సాధిస్తామన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి రైతు సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. లేకుంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. రాస్తారోకో చేస్తున్న గండ్రను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మారెపల్లి నందం, దూదిపాల తిరుపతిరెడ్డి, దైనంపెల్లి సుమన్, మేకల శ్రీనివాస్, కొమ్ముల శివ, మేకల వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్‌కుమార్ తదితరులున్నారు.