హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : కాళోజీ కళాక్షేత్రం కట్టింది బీఆర్ఎస్ సర్కారేనని, తాము చేసింది చెప్పుకోలేకపోయామని, కానీ, కాంగ్రెస్ వాళ్లు చేయంది కూడా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డిమార్ గుడ్డిదెబ్బల నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిండని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వీ సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు ప్రారంభోత్సవాలు, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలకు పోజులు ఇస్తున్నారన్నారు.
కాళోజీ గురించి తెలియని, మిత్ర మం డలితో సంబంధంలేని స్థానిక ఎమ్మెల్యే అవగాహన లేకుం డా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాళోజీ కళా క్షేత్రానికి బీజం పడింది బీఆర్ఎస్ పార్టీతోనే అన్నారు. ఆనాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు స్కూల్ ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలు నిర్వహించేవారని, ఈ నేపథ్యంలోనే కాళోజీ మిత్ర మండలి నవీన్, అశోక్, రామశాస్త్రి తదితర కవులు కాళోజీ స్మారక కేంద్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరంగల్ డీఐజీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న 300 గజాల ప్రభుత్వ స్థలం ఇవ్వాలని కోరినట్లు గుర్తుచేశారు.
కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ నాటి పాలకులు చూద్దాం, చేద్దాం అన్నారే తప్ప స్థలం ఇవ్వలేదన్నారు. 2012లో కేసీఆర్‌ను కలిసినప్పుడు తెలంగాణ ఏర్పడగానే రవీంద్ర భారతిని తలదన్నేలా 3000 గజాల్లో కాళోజీ కళాక్షేత్రం కట్టుకుందామని చెప్పారని, అన్నట్టుగానే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ సంస్థలు మారడం, కరోనా, ఎన్నికల కోడ్‌తో పనులు కొంత ఆలస్యమైనా 90శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. కాళోజీ కళాక్షేత్రాన్ని కవులు, కళాకారులకు అందుబాటులో ఉంచాలని, వారికి ప్రత్యేక గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు. తాను వేసిన శిలా ఫలకాలని పగలగొట్టి కొత్తవి వేస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ కాంగ్రెస్ పాలన సాగుతున్నదని, నియోజకవర్గ హద్దులు కూడా ఎమ్మెల్యే నాయినికి తెలియదన్నారు.
హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టి ఆయనకు సముచిత స్థానం కల్పించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కళాక్షేత్రం ప్రారంభానికి ఇప్పటివరకు కాళోజీ మిత్ర మండలి సభ్యులను ఎందుకు ఆహ్వానించలేదని వినయ్‌భాస్కర్ ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం అడిగితే ఇవ్వలేదని, స్థానిక నాయకులు రాజకీయాలు చేయకుండా కవులు, కళాకారులను గుర్తించాలని హితవు పలికారు. నయీంనగర్ బ్రిడ్జి, కాళోజీ కళాక్షేత్రాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, నాయకులు పులి రజినీకాంత్, నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.