వరంగల్ చౌరస్తా, మే 8: ‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. అనుమతి తీసుకుని బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తొలగించడాన్ని నిరసిస్తూ ఇటీవల వరంగల్‌లోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తే అప్పటికే పగిలిపోయివున్న క్యాబిన్ అద్దాలను ధ్వంసం చేసినట్లు తప్పుడు కేసులు సృష్టించి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కస్టడీలోవున్న పార్టీ నాయకులను శుక్రవారం వినయ్‌భాస్కర్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2022 మే 6వ తేదీన రేవంత్‌రెడ్డి వరంగల్ కేంద్రంగా రాహుల్‌గాంధీతో రైతు డిక్లరేషన్ చేయించి ఓట్లు దండుకొని మోహం చాటేశాడని విమర్శించారు. కాంగ్రెస్ మోసాన్ని బట్టబయలు చేయడానికి రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ కార్యాచరణ చేపట్టడాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేసిందన్నారు.
24 గంటల ముందు అనుమతులతో ఏర్పాటు చేసిన స్వాగ త తోరణాలను, పార్టీ జెండాలను తొలగించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను కేటీఆర్ వివరించడంతో తప్పుడు ఫిర్యాదులతో సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారని అన్నారు. డీజీపీ నుంచి ఎస్సై స్ధాయి వరకు అందరూ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని తెలిపారు. రైతుల కన్నీటిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు.