వరంగల్, జూన్ 8 : కాంగ్రెస్ సర్కారు ప్రజా ప్రభుత్వం పేరుతో పర్సంటేజీల పాలన సాగిస్తున్నదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. సోమవారం వరంగల్ నగరంలోని 17వ డివిజన్ దూపకుంట, గాడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పని కమీషన్ల చుట్టూనే తిరుగుతున్నదని, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు నుంచి కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి వరకు లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కారు వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులను రాజులా చేసి, పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగయ్యాయని, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకే కొత్త శిలాఫలకాలు వేసుకుంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీ బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడొద్దని, పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని చల్లా సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.