ఆత్మకూరు, ఆగస్టు 24 : రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ రణం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రైమ్ రేటు తగ్గిందన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని అక్రమంగా కేసులు పెట్టొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దన్నారు.