బయ్యారం ఏప్రిల్ 09 : రాష్ట్రంలోని కాంగ్రెస్ చేతల సర్కారు కాదు.. కేవలం మాటల సర్కారే అని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. బయ్యారం మండలంలోని నామలపాడు పైలట్ గ్రామపంచాయతీని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామలపాడు పంచాయతీని పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించిన ప్రభుత్వం జనవరి 26వ తేదీన మంజూరు పత్రాలు అందజేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.
పంచాయతీ పరిధిలోని ధర్మపురం, నామాలపాడు, రాయకుంట గ్రామాల పరిధిలో 115 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా గుర్తించి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య మంజూరు పత్రాలు అందజేశారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు మాయ మాటలు చెప్పి అధికారులు ఇచ్చిన మంజూరు పత్రాలని వెనక్కి తీసుకొని, ప్రస్తుతం జిపి పరిధిలో 26 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం రోజున అందజేసిన మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
అంతేకాకుండా ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ వంటివి కూడా సరిగ్గా లేవని, అర్హులకు అందలేదని అన్నారు. పైలట్ గ్రామాల్లో అర్హులకు నూరు శాతం పథకాలు అందిస్తామని గొప్పలు చెప్పి అట్టహాసంగా కార్యక్రమాలు ప్రారంభించిన సర్కార్.. ఆచరణలో మాత్రం కొందరికే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. మంజూరు పత్రాలు అందజేసిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అర్హులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాత గణేష్, నాయకులు సత్యనారాయణ, ఐలయ్య తదితరులు ఉన్నారు.