హసన్‌పర్తి, మార్చి 29 : రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతుందా? లేకా పోలీస్ పాలనా జరుగుతుం దా? అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం పెగడపల్లిలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రేటర్ ఒకటో డివిజన్ పరిధిలోని ముచ్చర్ల, పెగడపల్లి, పలివేల్పుల, గుండ్ల సింగారం, ఎర్రగట్టుగుట్టలోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేండ్లు గడిచినా గ్రామాల్లో తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని ఎద్దేవ చేశారు. శిలాఫలకాలు వేసి అటు వైపు చూసిన దాఖలాలు లేవన్నారు.
పెగడపల్లి పీఏసీఎస్ పరిధిలోని రైతులకు నేటికీ రుణమాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తూ ప్ర జాస్వామ్యాన్ని కూనీ చేస్తుందన్నారు. అంతేకాకుం డా గ్రామాలు, డివిజన్లలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తప్పుడు కేసులకు బీఆర్ఎస్ బయపడేది లేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉండి కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. పరిపాలన చేయడం చేతగాకా, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన ఘనుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేసి కాంగ్రెస్ చెప్పిన దొంగ హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లి ఎండగట్టాలని, తమ అధిష్టానం ప్రకటించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కార్పొరేటర్ రవినాయక్, బీఆర్ఎస్ జిల్లా నా యకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, పాక్స్ మాజీ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, కుమార్‌యాదవ్, డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, అటికం రవీందర్, నాయకులు విక్టర్‌బాబు, లక్ష్మణ్, శ్రీకాంత్, ప్రమోద్, శ్రీధర్ పాల్గొన్నారు.