వరంగల్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ అంటేనే కష్టాలు అని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేది.. ఉండబోయేది కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కేసీఆర్ హయాం లో ఎస్సారెస్పీ కాల్వలు నదిని తలపిస్తే ఇవాళ అవి బురద, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం నర్సంపేట నియోజకర్గ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకుమందు గీసుగొండ, ఆ తర్వా త నర్సంపేట నియోజకవర్గంలోని మండలాల కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. కాంగ్రెస్ అంటేనే కరువని, రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు అండగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గ్రామాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొనే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు జంకుతున్నదన్నారు. అయితే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని మాధ్యమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రైతులు సహా అన్నివర్గాలకు వివరించాలని సూచించారు. కేసీఆర్ హయాంలోనే తమకు న్యాయం జరిగిందని, తమకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆశ, అంగన్వాడీ వర్కర్లు హరీశ్‌రావుకు వివరించారు. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ప్రభుత్వ దమననీతిని ఎండగడతామని భరోసా ఇచ్చారు.
ఎరువులపై ఆరా
యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై హరీశ్‌రావు ఆరా తీశారు. కేసీఆర్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం ఎదురుచూసే పరిస్థితి లేదని, ఇప్పుడు రైతులు ఒక్క బస్తా యూరియా కోసం రోజు ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని, మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలను రైతులు అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.
గులాబీ శ్రేణుల్లో జోష్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. అది పార్టీ కార్యక్రమం కానప్పటికీ హరీశ్‌రావు నర్సంపేటకు వస్తున్నారు అనే సమాచారం అందుకున్న గులాబీ శ్రేణులు తమ నాయకుడికి అడుగడుగునా నీరాజనాలు పలికాయి. పరకాల, నర్సంపేట, ములుగు నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు ఆయన రాక సందర్భంగా ఊరూ రా రోడ్ల మీదకు వచ్చి స్వాగతం పలికా రు.
వరంగల్-నర్సంపేట ప్రధాన రహదా రి, నర్సంపేట నుంచి ములుగు నియోజకవర్గం మల్లంపల్లి (నల్లబెల్లి మండలం మీదుగా) వరకు దాదాపు రోడ్డు పక్కను న్న గ్రామాలు గులాబీమయమయ్యాయి. వానకాలం పనులున్నా ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగా హరీశ్‌రావుకు బ్రహ్మరథం పట్టారు. పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామం వద్ద మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ ధర్మారావు నివాసంలో కొద్దిసేపు ఆగి అక్కడున్న కార్యకర్తలతో ముచ్చటించారు. హైదరాబాద్ నుంచి హరీశ్‌రావు వెంట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి ఉన్నారు. కాగా, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, మాజీ జడ్పీటీసీ పెద్ది స్వప్న, ములుగు జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తదితరులు ఆయా ప్రాంతాల్లో హరీశ్‌రావుకు స్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు.