ధర్మసాగర్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మాజీ డాక్టర్ గుండె గుండె విజయరామరావు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధించే విద్యా బోధనలను అర్థం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.
విద్యార్థులు పాఠశాలకు ప్రతి రోజు సైకిల్ పై వెళ్లడం ద్వారా వారికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుందని, అది వారి మేధోసంపత్తికి కూడా దోహదం చేస్తుందని అన్నారు. విద్యార్థులు గొప్పస్థాయికి ఎదిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని గొప్పస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, రిటైర్డ్ కేయూ ప్రొఫెసర్ వెంకటనారాయణ, డాక్టర్ శ్వేత, డాక్టర్ రాహుల్, డాక్టర్ మురళి కృష్ణ, డాక్టర్ కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.