కాశీబుగ్గ/వర్ధన్నపేట/తొర్రూరు, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, తిరిగి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్లోని కేవీ ఫంక్షన్‌హాల్, 3వ డివిజన్ ఆరెపల్లిలోని వజ్ర గార్డెన్స్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి డీసీతండా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే గిరిజన తండాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.
అలాగే రైతులకు సాగునీరు సమృద్ధిగా అందడంతో వ్యవసాయంపై ఆధారపడిన గిరిజన కుటుంబాలు ఆర్థికంగా ప్రగతి సాధించాయన్నారు. తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే గిరిజనులు మరింత అభివృద్ధి చెందుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 16 నెలలుగా తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని, పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. మార్పును కోరుకున్న ప్రజలు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారిని మరోసారి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమైన తీరుతో పాటు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి డివిజన్ల ఫోరం కన్వీనర్ నేరెళ్ల రాజు, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, వీర్ల భిక్షపతి, నాయకులు కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, కొత్తపల్లి యాదగిరి, పత్రి రాజపోశాలు, గండ్రాతి భాస్కర్, పసులాది మల్లయ్య, వర్ధన్నపేట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి,
తొర్రూరు మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగలపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పటి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, పార్టీ పట్టణ వరింగ్ ప్రెసిడెంట్ ఏ ప్రదీప్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, నాయకులు పొనుగంటి సోమేశ్వరరావు, ఎన్నమనేని శ్రీనివాసరావు, మణిరాజు, తూర్పటి రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, తొర్రూరు డివిజన్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తొర్రూరు సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఎర్రబెల్లి మద్దతు పలికారు.