హనుమకొండ, నవంబర్ 20 : అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడేవి చిల్లర.. చీటర్.. బ్రోకర్ మాటలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలోని తన నివాసంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసుదనాచారి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎర్రబెల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహఙంచిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం మాట్లాడిన మాటలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అంటున్న రేవంత్‌రెడ్డి.. నువ్వు తెలంగాణలో గంజాయి మొక్కవు.. నిన్ను పీకి అవతల పారేస్తాం’ అని హెచ్చరించారు.కేసీఆర్ మర్రి చెట్టులాంటి మహా వృక్షం అని అన్నారు. సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే రేవంత్‌ను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేసారు. ఇప్పటికి 30 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వని విషయం తమకు తెలుసన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేయలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ‘నన్ను రాక్షసుడు అన్నావు.. అవును నేను ప్రజల కోసం పనిచేసే రాక్షసున్నే.. నా ప్రజల కోసం ఏమైనా చేస్తాను’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
తాను ఏడుసార్లు వరుసగా గెలిచానని, ఒకసారి గెలిచిన చోట మరోసారి గెలిచిన చరిత్ర రేవంత్‌కు లేదన్నారు. ‘నీ మాటలు నమ్మి ఓటేసిన ప్రతి ఒకరినీ మోసం చేశావు.. అధికారం వచ్చాక కూడా నీ ప్రవర్తనలో మార్పు రాకపోవడం సిగ్గుచేటు’ అని అన్నారు. సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నావో సోయి ఉందా రేవంత్ రెడ్డి? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ‘ప్రజా విజయోత్సవ సభలు పెట్టడం కాదు.. నిన్ను గెలిపించిన నీ సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకో’ అని సూచించారు.
‘ఆనాడు ఉద్యమకారులపై తుపాకి గురిపెట్టిన నువ్వు ఈ రోజు అది చేసిన.. ఇది చేసిన అంటున్నవు. అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా? బాబ్లీ పోరాటంలో కూడా తప్పించుకొని తిరిగింది మర్చిపోయావా?’ అని ప్రశ్నించారు. ఓటమి ఎరుగని నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణాలు తీసిన సోనియాగాంధీకి బలిదేవత బిరుదు ఇచ్చిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు ‘నా అమ్మ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అమ్మ’ అనడానికి నోరెలా వచ్చిందన్నారు.
ప్రజా పాలన అంటూ ప్రజలను గాలికి వదిలేసిన రేవంత్‌రెడ్డి గాలి మోటర్లో ఢిల్లీ చుట్టూ చకర్లు కొడుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల ముందు వరంగల్ వేదికగా రాహుల్‌గాంధీతో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. కాళోజీ కళాక్షేత్రం కోసం 300 గజా ల స్థలం అడిగితే ఇవ్వని కాం గ్రెస్ నాయకులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏనాడైనా కాళోజీని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూసావా? కలిశావా? అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో కాళోజీ కళాక్షేత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తే.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి తామే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా మహిళలకు రూ. 2,500, బతుకమ్మ చీరలు, తులం బంగారం పథకాలను అమలు చేయాలన్నారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఎన్టీఆర్ హయాంలో మహిళా సంఘాలు ఏర్పాటైతే వాటిని క్షేత్రస్థాయిలో మాజీ సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని, అది కూడా సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.
మిషన్ భగీరథ ద్వారా రూ. వేల కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరందించిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సొంత పార్టీ ఎమ్యెల్యేలే సీఎంకు విలువ ఇవ్వడం లేదని, విజయోత్సవ సభకు రాని నర్సంపేట ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డే అందుకు నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లను చూసే ఆనాడు కాళోజీ ‘ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరెయ్యాలి.. పరాయోడు మోసం చేస్తే పొలిమేరల వరకు తరిమికొట్టాలి‘ అని చెప్పాడని అన్నా రు. ‘రేవంత్‌రెడ్డి.. నిన్ను పాతి పెట్టేందుకు యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఇకనైనా తీరు మార్చుకొని సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని ఎర్రబెల్లి హితవు పలికారు.
హనుమకొండలో నిర్వహించిన సభకు వచ్చిన మహిళలు సీఎం రేవంత్‌రెడ్డిని అసహ్యించుకుంటున్నరు. కొండను తవ్వి ఎలుకనైనా తీస్తాడనుకుంటే.. ఏమీ తీయలేదు. ఏపీవోలు, ఎంపీడీవోల ఒత్తిడితోనే మహిళలు అయిష్టంగా సభకు వచ్చారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా కవులు, కళాకారును సన్మానించకపోవడం సిగ్గుచేటు. రాబోయే ఎన్నికల్లో మహిళలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నిన్ను గద్దె దించేందుకు కూడా వరంగల్ మొదటే ఉంటుంది.
– డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే
హనుమకొండలో కాంగ్రెస్ నిర్వహించింది ముమ్మాటికీ వంచన సభ. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు, దుర్మార్గపు మాటలు మాట్లాడారు. అనుభవలేమి, అవగాహనా రాహిత్యాన్ని సీఎం స్వయంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి మహిళలకు చేస్తున్న ద్రోహానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500, 18 ఏళ్లు పైబడి చదువుకొనే యువతులకు ఎలక్ట్రిక్ సూటర్లు, ఆడబిడ్డ వివాహానికి లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారంతో పాటు అనేక హామీలిచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 4.25 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసి అన్ని రంగాల్లో ఉత్పాదకతను పెంచి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచి, దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలబెట్టాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే 11 నెలల్లో రూ. 85 వేల కోట్ల అప్పు చేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఘోర వైఫల్యానికి, అనుభవ, అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
అధిష్టానం అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నదని, సహచర మంత్రుల్లో అసహనం, రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత, దీనికి తోడు సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటుతో రేవంత్‌రెడ్డికి పదవీ గండం ఉంది. ఇంత దీన స్థితిలో ఉన్న రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి అగ్ర నాయకుడు వైఎస్ఆర్, నీ రాజకీయ గురువు చంద్రబాబునాయుడును ఎదిరించి నిలబడ్డ పోరాట యోధుడు కేసిఆర్. 25 ఏళ్లుగా తెలంగాణ నలుమూలల వటవృక్షంలా వేళ్లూనుకున్న నాయకుడిని మొలకెత్తనివ్వ అన్న నిన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. బీఆర్ఎస్ను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు.
– సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత
సీఎం రేవంత్‌రెడ్డి అధికార మదం, పిచ్చితో మాట్లాడుతున్నడు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్. ప్రజల గుండెల్లో గూడుకట్టుకొన్న వట వృక్షం. ఆయనను నువ్వు కాదు కదా.. నీలాంటి వంద మంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా ఏమీ చేయలేరు. సమైక్య పాలనలో కాళోజీ ప్రస్తావన లేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి సీఎం కేసీఆర్ కాళోజీకి గుర్తింపు ఇచ్చారు. కాళోజీ కళాక్షేత్రం కోసం గత కాంగ్రెస్‌లోని ముగ్గురు మంత్రులను 300 గజాలడిగితే 3 గజాల స్థలం ఇవ్వలేదు. ఆశపడ్డ మహిళలు, విద్యార్థులు భంగపడ్డరు. వరంగల్ డిక్లరేషన్ ఏమైంది?
– దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
అనుకోకుండా సీఎం అయిన రేవంత్‌రెడ్డి తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నడు. దౌర్భాగ్యుల చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ పడింది. చేతకాని తనానికి మాటలెక్కువ అన్నట్లుగా సీఎం తిట్ల పురాణం చెప్పారు. సభలో మాట్లాడిన సింహభాగం కేసీఆర్ ప్రస్తావనే వచ్చింది. కేసీఆర్‌ను అసెంబ్లీకి రా.. రా అంటున్నవ్.. ఆయన వస్తే ఎదురునే దమ్ము, ధైర్యం ఉందా నీకు? నువ్వు.. నీ పరివారం తట్టుకోలేరు.. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. త్వరలోనే నీ ప్రభుత్వం కూలి పోతుంది.. నిన్ను నీ సొంత పార్టీ నేతలే త్వరలో గద్దె దింపడం ఖాయం.
– గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కుక్కతోక వంకర అన్నట్టు ఉంది సీఎం రేవంత్‌రెడ్డి తీరు. అతడు చేస్తున్నవన్నీ డైవర్షన్ పాలిటిక్సే. కేసీఆర్ అప్పుల చేశాడని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. ఆయన సృష్టించిన సంపదపై ఎందుకు మాట్లాడటం లేదు. బెల్టు షాపులను కేసీఆర్ ప్రోత్సహించారని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. నీ పార్టీలోనే నీకు విలువలేదు. నీవు మూడు సార్లు మీటింగ్ పెడితే మీ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే ఎందుకు రాలేదు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు కేసీఆర్. కేటీఆర్, హరీశ్‌రావు ప్రజలకు గోమాత లాంటివారు.
– నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే
సీఎం రేవంత్‌రెడ్డిది దుష్టపాలన. వరంగల్ సభలో బూతు పురాణం చెప్పారు. ఆశతో సభకు వచ్చిన మహిళలు గోసపడ్డరు. కాళోజీ చరిత్రను అర్థం చేసుకోవడం రేవంత్‌రెడ్డికి సాధ్యం కాదు. మాజీ సీఎం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తే నీవు రైతులకు ఏం చేశావు? నీ మాటలతో రైతులు ఆశపడి భంగపడ్డరు. హిట్లర్, డయ్యర్ చరిత్ర ఏమైందో తెలుసుకో. నీ నోరు, నీ మంత్రుల నోరు మూసీ కంపులాగా ఉంది. రియల్ ఎస్టేట్‌ను నీ అన్నదమ్ములకు వదిలిపెట్టి, నువ్వు, డిప్యూటీ సీఎం, పొంగులేటి ముగ్గురు కలిసి ఆంబోతుల్లా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. 15 శాతం కమీషన్లు ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తున్నారు. దమ్ముంటే బెల్ట్‌షాపులను మూయించు. గ్రామాల్లో గుడుంబా ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదు. తెలంగాణలో కేసీఆర్ అనే మొకను మొలనివ్వనంటున్నావ్.. కేసీఆర్ అనే మహా వృక్షం నీడ నిన్ను ఎప్పుడూ వెంటాడుతునే ఉంటుంది. నువ్వు కూర్చున్న కుర్చీలో కూడా కేసీఆర్ కనిపిస్తడు. ఒట్టేసి చెబుతున్నా.. ఓరుగల్లు నుంచే నీ పతనం మొదలైతది. మమ్ములనే అసెంబ్లీలో తట్టుకోలేక పోతున్నవ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తట్టుకుంవా. కేసీఆర్ అవసరమైనప్పుడు కచ్చితంగా వస్తారు. మిమ్ముల వదిలే ప్రసక్తే లేదు.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే