దేవరుప్పుల, జనవరి 10 : పాలకుర్తిలో నిరంకుశ పాలన నడుస్తున్నదని, ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా .. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురు గిరిజన బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా వేధించారన్నారు. అందులో ఒకరు పోలీస్‌స్టేషన్ సాక్షిగా మృతి చెందిన విషయం ప్రజలకు తెలిసిందేనని పేర్కొన్నారు. ఆర్జీ టీవీ రిపోర్టర్‌పై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ చానల్ రిపోర్టర్, గిరిజన బిడ్డ రాజ్‌కుమార్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాడని, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలిచి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాడన్నారు.
అలా అని అతడిని అప్పటి ప్రభుత్వం కానీ, తాను కానీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవన్నారు. అతను ప్రజల నుంచి వాయిస్‌లు తీసుకొని యూట్యూబ్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడని, ఇదే పని నేడూ చేస్తున్నాడని చెప్పారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలకు చేస్తున్న అన్యాయాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపడం అతడు చేసిన నేరమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. రాజ్‌కుమార్‌ను గురువారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి జనగామ జైలుకు తరలించారని, అతను చేసిన తప్పేంటి.. పాలకుర్తి ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతుందన్నారు. గిరిజన బిడ్డలు ఓట్లేస్తే గెలిచిన మీరు రేపు గిరిజనులకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.
పాలన చేతకాక అక్రమాలను ప్రశ్నిస్తున్న గిరిజన బిడ్డలను ఇలా పని పట్టుకొని కేసులు పెట్టిస్తే వారు తిరుగబడే రోజు వస్తుందన్నారు. రాజ్‌కుమార్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచి జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందన్నారు. పాలకుర్తిలో అక్రమ కేసులు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కాగా, ఆర్జీ టీవీ రిపోర్టర్‌ను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శనివారం పాలకుర్తి, తొర్రూరు మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ తెలిపారు.