పెద్దవంగర, ఆగస్టు 21: మూడు విడతల్లో రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని.. రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతాడని అన్నారు. రూ. 49వేల కోట్లని చెప్పి.. 17కోట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..
రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని అధికార కాంగ్రెస్ మంత్రులే అంటుంటే రేవంత్ రెడ్డికి సిగ్గులేదన్నారు. ఆయనకు అన్ని దేవుళ్ల మీద ఒట్లు తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని పేర్కొన్నారు. హరీశ్‌రావు సవాల్ భయంతోనే రుణమాఫీ మొదలు పెట్టారన్నారు. ఖమ్మం సభలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందనడం రేవంత్ రెడ్డి తెలివితకువతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తోందని అన్నారు. రుణమాఫీ మీద సరైన అవగాహన లేని ఈ మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, నిన్నటికి నిన్న ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7వేల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని, ఇంకా పదివేల కోట్లు జరగాల్సింది ఉందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు అండగా ఉంటామన్నారు. ఆరు గాలం కష్టపడి పండించిన రైతు పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనే ఉందని, కేసీఆర్ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో పంటలు పండించుకునేందుకు రైతులకు కనీసం సాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, వెంటనే పూర్తిగా రుణమాఫీ చేసి, అలాగే రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో పాల్గొన్న రైతులతో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానికంగా ఉన్న ఎస్బీఐకి వెళ్లి అకడి అధికారులను రుణమాఫీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దవంగర బ్యాంకులో మొత్తం 1900 మంది రైతులు రుణాలు తీసుకుంటే 800 మందికే మాఫీ అయిందని రూ. 25 కోట్లకు రూ.9 కోట్లే మాఫీ అయ్యాయని తెలిపారు. 40 శాతానికి మించి రైతులకు రుణమాఫీ కాలేదని, పైగా డబ్బులు అన్ని బ్యాంకు ఖాతాల్లో పడి ఉన్నాయని చెప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రతి ఒక రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, రైతులు, ప్రజలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ పాల్గొన్నారు.