దేవరుప్పుల, జూన్ 7 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారానికి కేసీఆర్ ఎంత చిత్తశుద్ధితో కృషిచేశారో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే విజన్‌తో తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని ఆ రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనత ఎన్నటికీ ఆయనకే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. అమెరికాలోని వాషింగ్టన్లో వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ (వాటా) ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క టీ అమలుచేయలేదన్నారు. అదే కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నికల్లో ఇవ్వని అనేక హామీలను కూడా అమలు చేసి ప్రజల మనసు చూరగొన్నారని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్టు, దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకల్పన, సాగునీటి వసతులు, వ్యవసాయానికి 24గంటల కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూంలు, వృద్ధాప్య పింఛన్లు ఇలా ఇవన్నీ సాధారణ కుటుంబాలను, రైతులను ఆర్థికంగా ఆదుకునే పథకాలని వివరించారు. రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనన్నారు. ఇక డాలస్‌లో తెలంగాణ ఎన్నారైలు నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ, ఆవర్బావ సభ అనూహ్య విజయం సాధించిందన్నారు.
మరో రెండున్నరేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈమేరకు ఎన్నారైలు కృషిచేయాలని కోరారు. ఇక అమెరికాలో ట్రంప్ పాలసీతో మన విద్యార్దులు కొందరు అవస్ధలు పడుతున్నారని, వారికి సహకారం అందించాలని వాటా సభ్యులు వంశీరెడ్డి, రాజేశ్, సందీప్, భూషణం, గణేశ్ వీరమనేని, మాణిక్యం బృందాన్ని ఎర్రబెల్లి కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్వరెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఉన్నారు.