వర్ధన్నపేట, మే 1: ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఎర్రబెల్లి మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగు నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు, రైతులు కాంగ్రెస్‌పై మండిపడుతున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశాల్లో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ ఎం భిక్షపతి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.