దేవరుప్పుల, సెప్టెంబర్ 3 : ఖమ్మం వరదల విషయంలో ప్రభుత్వం తీరు రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న చందంగా ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. ఖమ్మం వరద విలయం చూడడానికి, బాధితులను ఆదుకోవడానికి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు వెళ్తే వారిపై కావాలని కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఖమ్మంలో ముగ్గురు మంత్రులుండీ చేసిందేమీ లేదని వరద ప్రాంతాల్లో పర్యటించిన వారిని బాధితులే తరిమిన దాఖలాలున్నాయని, అడుగుడుగునా నిలదీసిన సందర్భాలున్నాయన్నారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన నేపథ్యంలో సీఎం డౌన్‌డౌన్ అనే నినాదాలు వినిపించాయని, ఇదంతా ప్రభుత్వ అసమర్థత అని గమనిస్తే బాగుండేదన్నారు. వరద బాధితులను ఆదుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆ పనిచేద్దామని వెళ్తే గూండాలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్లపై దాడులు చేయడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఈ దాడిపై ముఖ్యమంత్రిలో పాటు మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.