సుబేదారి, ఫిబ్రవరి 4: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ నక్కలగుట్ట హరితహోటల్లో ఆదివారం జరిగింది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్కాలనీకి చెందిన నల్లా భాస్కర్‌రెడ్డి(28) కనకదుర్గ చిట్‌ఫండ్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో చాలామంది నుంచి డిపాజిట్లు చేయించాడు. కానీ యాజమాన్యం ఆరు నెలలుగా అతడికి వేతనం ఇవ్వకపోగా ఉద్యో గం నుంచి తొలగించింది. పైగా డిపాజిట్లు చేసిన వారికి యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో వారి నుంచి అతడికి ఒత్తిడి పెరిగింది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి హనుమకొండ నక్కలగుట్ట హరిత హోటల్లో రెండు రోజుల క్రితం రూమ్ తీసుకొని ఉంటున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. హరిత హోటల్ ముందు అతడి కారును గుర్తుపట్టి, రూమ్ బుకింగ్ వివరాలను హోటల్ సిబ్బందిని తెలుసుకున్నారు. వారు చెప్పిన గదికి వెళ్లి డోర్ పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతదేహమై వేలాడుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు సేకరించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
హరిత హోటల్లో ఆత్మహత్యకు పాల్పడిన భాస్కర్‌రెడ్డితో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని కనుకదుర్గ చిట్‌ఫండ్ ఎండీ ఓ ప్రకటనలో తెలిపారు. తమ కంపెనీ డైరెక్టర్ కూడా కాదని, ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి మానేశాడని పేర్కొన్నారు. తమ కంపెనీపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.