మహబూబాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : మ హబూబాబాద్ జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతోపాటు బ య్యారం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం కూడా చిరుజల్లులు పడ్డాయి. దీంతో మానుకోట ప్రజలు గజగజా వణికిపోతున్నారు. మహబూబాబాద్ పట్టణంలో 18.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అతి భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.
ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. నెల్లికుదురు మండలంలో రావిరాల, ఆలేరు, వావిలాల ప్రాంతాల్లో కాజ్‌వేలపై నుంచి వరద ఉప్పొంగడం తో మహబూబాబాద్ నుంచి నెల్లికుదురుకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు, చిన్నగూడూరు నుంచి నర్సింహులపేటకు రవాణా బంద్ అయ్యింది. ఇనుగుర్తి మండలం చిన్న నాగారం-నెల్లికుదురు కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తుండడం తో ప్రజలు అటు, ఇటు వెళ్లలేదు. చిన్నగూడూరు నుంచి పగిడిపల్లి గ్రామాల మధ్య జిన్నెల వాగు ఉప్పొంగడంతో గుండంరాజుపల్లి మీ దుగా నర్సింహులపేటకు రవాణా సౌ కర్యం నిలిచిపోయింది.
గార్ల మండల కేంద్రంలోని పాకాల ఏటిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీ, కురవి గేట్, అనంతారం రోడ్డులోని పలు కాలనీల్లో నీళ్లు చేరా యి. వారం క్రితం కురిసిన వర్షాలకు నరకయాతన అనుభవించిన జనం ఇప్పటికీ కోలుకోకపోగా, మళ్లీ వర్షం పడడంతో భ యంభయంగా గడుపుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలకు తాతాలిక మరమ్మతులు చేయకముందే మళ్లీ వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు.
బయ్యారం మండలంలోని పెద్ద చెరువు తెగిందని వదంతులు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు వెళ్లి పెద్ద చెరువును పరిశీలించి కట్ట తెగలేదని తేల్చి చెప్పారు. రెండు రోజులపాటు కురిసిన వ ర్షాలకు మున్నేరు, ఆకేరు, పాలేరు, జిల్లెల వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బ యటకు రావొద్దని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రా మ్నాథ్ కేకన్ పిలుపునిచ్చారు. రానున్న మరో 24 గంటల్లో భారీ వర్షం పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని జంకుతున్నారు.