 
                                                            నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 30 : వరదల్లో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా, గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రవాహంలో ఓ యువతి గల్లంతైంది. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన పులిగడ్డ సంప త్ (30) మొట్లతండా వద్ద పెద్ద చెరువు మత్తడి దాటుతున్న క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టు కుపోయి మృతి చెందాడు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం అలియాస్ నాగన్న(58) కల్వర్టులో పడి మృత్యువాత పడ్డాడు. ఇతడు హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ము గించుకుని బుధవారం రాత్రి ఇంటికి వచ్చే సమయానికి వర్షం మరింత ఎకు వైంది. దీంతో గ్రామంలోకి వెళ్లే కల్వర్టు పూర్తిగా జలమయమైంది. ఎలాగైనా కల్వర్టు ధాటి గ్రామంలోకి వెళ్లే సాహసం చేస్తుండగా వర్షం ధాటికి దారి కనిపించక అందులో పడి మృతి చెందాడు. వరంగల్ ఎస్ఆర్నగర్లోని అడెపు కృష్ణమూర్తి(65)కి భార్య, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు.
అనారోగ్యంతో మంచంలోనే ఉంటుండగా బుధవారం కురిసిన వర్షాని కి ఆ ప్రాంతం జలమయంగా మారింది. అధికారులను స్థానికులను పునరావాస కేంద్రానికి తరలించగా ఇతడిని గమనించ లేదు. దీంతో మంచంపై నుంచి నీటిలో పడి మృతి చెందాడు. గీసుగొండ మండలం గుట్ట కిందపల్లె గ్రామానికి చెందిన కూలి పులి అనిల్‌కుమార్ (30) తన భార్యతో కలిసి బుధవారం బైక్‌పై వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి వచ్చాడు. ఆమెను ముందుగానే బస్సు ద్వారా గ్రామానికి పంపించాడు. ఖిలా వరంగల్ అగడ్త ప్రవాహాన్ని సరిగా అంచనా వేయలేక బైక్‌తోపాటు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గురువారం శివనగర్‌లోని స్కూల్ వద్ద ప్రవాహంలో అనిల్ మృతదేహం కొట్టుకొ చ్చింది. హనుమకొండలోని సమ్మయ్యనగర్ కాలనీ(టీవీ టవర్స్)కి చెందిన ఆర్అండ్బీ రిటైర్డ్ డీఈఈ పాక శ్రీనివాస్ వరద నీటిలో గల్లంతయ్యాడు. కొద్దిసేపటికే ఆయన మృతదేహం దొరకడంతో కుటుంబ సభ్యులు విలపించారు.
అదేవిధంగా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో ఇంటి మట్టి గోడ కూలి కోల రామక్క(80) మృతి చెందింది. ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన గద్దల సూరమ్మ(58) తన ఇంట్లో నిద్రిస్తుండగా గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య బైక్‌పై దమ్మన్నపేట వైపు బుధవారం రాత్రి వస్తుండగా, జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట శివారులోని బోళ్ల మత్తడి వద్ద రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో యువతీయువకుడు కొట్టుకుపోయారు. శివకుమార్‌కు చెట్టు కొమ్మ ఆసరా దొరకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. శ్రావ్య గల్లంతైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలిస్తున్నారు. శ్రావ్య తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నట్లు, కూతురిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉంచి చదివిస్తున్నట్లు తెలిసింది.
 
                            