వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 30 : కొవిడ్ కొత్త వేరియంట్ వరంగల్వాసులను భయభ్రాయంతులకు గురిచేస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా వారికి పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు, మూడు రోజుల నుంచి వైద్య చికిత్సల కోసం ఎంజీఎంకు వచ్చిన చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలను గుర్తించిన వైద్యులు, నమూనాలను సేకరించి, కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. శనివారం నివేదికలు పాజిటివ్ అని రావడంతో సదరు పిల్లలకు వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. చిన్నారుల్లో కొవిడ్ వ్యాప్తిని గుర్తించినందున పిల్లల వార్డు(పీడియాట్రిక్ వార్డు)లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 20 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, వెంటిలేటర్లు సమకూర్చుకొని అప్రమత్తంగా ఉన్నామని విభాగాధిపతి డాక్టర్ ప్రతాప్ తెలిపారు. బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ దుగ్గొండి మండలానికి చెందిన ఒక్కరిని మాత్రమే అడ్మిట్ చేసుకున్నట్లు చెప్పారు. మిగతా నలుగురి వయస్సు ఒకటి నుంచి రెండేళ్ల మధ్య ఉండడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో కుటుంబసభ్యులకు తగు జాగ్రత్తలు తెలిపి హోం ఐసొలేషన్‌లో ఉంచినట్లు వివరించారు. బాధితులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ వేరియంట్ ప్రాణహాని కలిగించే అవకాశాలు చాలా తక్కువని, ఐనప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరి ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించడం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.