మహదేవపూర్(కాళేశ్వరం)/ ఏటూరునాగారం/ మంగపేట/ కన్నాయిగూడెం/ వాజే డు/ వెంకటాపురం(నూగూరు), ఆగస్టు 29: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ నది గరిష్ఠ ప్రవాహం 13.460 మీటర్లు కాగా, ప్రస్తుతం 12.210 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గొర్రెలు, పశువుల కాపరులు, మత్య్సకారులు నదిలోకి వెళ్లొద్దని సూచించారు.
మండల పరిధిలోని చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపోయాయి. సుమారు 50 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 14.830 మీటర్లకు గోదావరి చేరుకోగా కలెక్టర్ ఆధ్వర్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 15.560 మీటర్లకు చేరుకుంది. క్రమంగా నీటి మట్టం పెరగడంతో కరకట్ట గేట్లను మూసేశారు. అయినప్పటికీ రామన్నగూడెం పుష్కరఘాట్‌కు సమీ పంలో ఉన్న గేటు నుంచి లీకేజీ వాటర్ గ్రామం పరిసరాల్లోకి చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని కూడా గోదావరి చేరుకునే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ ఇన్‌టేక్ వెల్, మంగపేట పుష్కరఘాట్ మొదలు కొని ములుగు జిల్లా సరిహద్దు గ్రామం అకినేపల్లిమల్లారం దాకా పలు తీరాల్లో నదీ ప్రవాహం పెరిగింది. పొదుమూరు, నర్సాపురం(బోరు), కమలాపురం, అకినేపలిమల్లారం గ్రామాల శివారు పంట పొలాల్లోకి గోదావరి బ్యాక్ వాటర్ కమ్ముకున్నది. బిల్ట్ ఇన్‌టేక్‌వెల్ వద్ద నదీ ప్రవాహం సముద్రమట్టానికి 82.5 మీటర్ల ఎత్తులో ఉంది.
కన్నాయిగూడెం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం 8,37,300 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 59 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. వాగుల నుంచి గోదావరి బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి చేరుకుంది. బుట్టాయిగూడెం, హనుమంతునివాగు, గంగగూడెం, నల్ల గుంటల బ్రిడ్జిల వద్ద చుట్టూ ఉన్న పంట పొలాలను ముంచెత్తింది. వెంకటాపురం మండల కేంద్రంలోని గోదావరి లంకలోకి వెళ్లే గోదావరి పాయలోకి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం పేరూరు వద్ద శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 52 అడుగులమేర గోదావరి నీటిమట్టం చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. టేకులగూడెం గ్రామశివారులోని మర్రి మాగువాగు బ్రిడ్జివద్ద హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏటూరునాగారం, ఆగస్టు 29 : గోదావరి వరదను నివారించేందుకు నీటి పారుదలశాఖ అధికారులు ఇసుక నింపిన బస్తాలు ఎండకు ఎండి వానకు తడిసి పికిలిపోగా, ఇవి ప్రమాదాన్ని నివారించే తట్టుకోగలవా.. అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రెండు సార్లు గోదావరి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. వరద ఉధృతికి కరకట్ట ఒడ్డు కోతకు గురవుతున్నది. కొన్ని చోట్ల రివిట్‌మెంటు కూడా కొట్టుకుపోతున్నది. అత్యవరమైతే ఇసుక బస్తాలను అడ్డు వేసి వరద ప్రమాదాన్ని తాత్కాలికంగా నిలిపేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా గేట్ల వద్ద తూములు లీకేజీ కాకుండా ఉండేందుకు ఇసుక బసాలు వేస్తారు. ఇందుకోసం ఈ ఏడాది సుమారు 2వేల ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వరద కరకట్ట దెబ్బతింటుందని అనుమానిస్తున్న ప్రదేశంలో వీటిని నిల్వ చేశారు. ఇసుక బస్తాలు కాస్త ఎండకు ఎండి, వానకు తడిసి ఎక్కడికక్కడే చీకిపోయాయి. ఎక్కడైనా వరద ప్రమాదం అకస్మాత్తుగా సంభవిస్తే ఇవి ఎలా పనిచేస్తాయని రామన్నగూడెంవాసులు ప్రశ్నిస్తున్నారు. వరదతో కరకట్టకు ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసి ఏటా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు. వరద పెరగ్గానే నీటిపారుదల శాఖ అధికారులు కరకట్టపైకి చేరుకుని పర్యవేక్షిస్తున్నా ఇక్కడ పనికి రాకుండా ఉన్న ఇసుక బస్తాలు మాత్రం వారికి కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ముంపు బాధితులు ప్రశ్ని స్తున్నారు. వరద ప్రమాదాన్ని నివారించేందుకు ఇవి ఎలా పనిచేస్తాయో వారికే తెలియాలంటున్నారు.