రాష్ట్రంలోనే దీక్షా దివస్ తొలి పైలాన్ ఉద్యమగడ్డ ఓరుగల్లులో ఏర్పాటు చేశారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోద ముద్ర వేసి రూ. 10 లక్షల నిధులతో నిర్మించారు. పైలాన్ లో బిగించిన పిడికిళ్లు దీక్షా స్ఫూర్తికి నిదర్శనంగా కనిస్తుంటాయి. ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంటాయి. పైలాన్‌పై ఒక వైపు ఉద్యమ నేత కేసీఆర్.. మరో వైపు సాకారమైన తెలం గాణ రాష్ట్ర చిహ్నం కనిపిస్తుంది. అనాటి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం వద్దకు రాగానే ఆనా టి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఒక తరం యాదిగా దీక్షా దివాస్ పైలాన్ ఉద్యమ శిఖరంగా తలెత్తుకుని నిలుస్తున్నది.
‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. అన్న నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29 చేపట్టిన దీక్ష అన్ని వర్గాలను ఏకం చేసింది. తెలంగాణ సమాజాన్ని సంఘటిత శక్తిగా మార్చి సమరాంగాన నిలిపింది. స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచ నలు దిశలా చాటి ఢిల్లీ నాయకుల గుండెలను వణికించి, పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షకు గుర్తుగా ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఆవరణలో దీక్షా దివస్ పైలాన్ ఏర్పాటు చేసింది. ఇది భావితరాలకు తెలంగాణ ఉద్యమ చర్రితను తెలిపే స్ఫూర్తి చిహ్నంగా నేడు కనిపిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించి ఉద్యమకారులను సన్మానించనున్నారు.
రాష్ట్రంలో ఏకైక దీక్షా దివస్ పైలాన్ ఉద్యమ గడ్డ వరంగల్‌లో ఉండడం గర్వకారణం. అనాడు కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. కేసీఆర్‌ను ఖమ్మం జై లుకు తరలిస్తుంటే ఉర్సు గుట్ట వద్ద అడ్డుకునే ప్రయ త్నం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనాడు జైలు జీవితం గడిపిన ఉద్యమకారులందరు ఉదయం 10 గంటలకు పైలాన్ వద్దకు రావాలి. దీక్షా దివస్‌ను పండుగలా జరుపుకోవాలి.
కరీమాబాద్ : కేసీఆర్ దీక్షా స్థలికి మేం బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయ డంతో బీఆర్ఎస్ శ్రేణులంతా వరంగల్ చౌరస్తా లో నిరసన చేపట్టాం. పోలీసులు అడ్డుకుని 12 మందిని ఇంతెజార్గంజ్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లారు. అదే రోజు కేటీఆర్‌ను వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రెండ్రో రోజుల తర్వాత మేం బయటకు వచ్చాం.
స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ నిరాహార దీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. ఓరుగల్లులో దీక్షా దివస్ స్ఫూర్తి చిహ్నం ఏర్పాటుకు అప్పటి పాలక వర్గం ఆమో దించి రూ. 10 లక్షలు కేటాయించింది. ఉద్యమకారులతో చిహ్నానికి రూపకల్పన చేశాం.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28 : ఉద్యమనేత కేసీఆర్ పోరాట ఫలితమే నేటి తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద నిర్వహించనున్న దీక్షా దివస్ కా ర్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరి కొండ మధుసూదనాచారి, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సంకు నర్సింగరావు, బోయిన పల్లి రంజిత్‌రావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు కంజర్ల మనోజ్‌కుమార్, పున్నంచందర్, పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.