జనగామ, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార బలంతో బీఆర్ఎస్ మద్దతుదారులను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడి తెచ్చినా పాలకుర్తి నియోజకవర్గంలోని 38 పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించిన పల్లె జనం ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డికి ఝలక్ ఇచ్చి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మరోసారి అక్కున చేర్చుకున్నారు. గ్రామాల్లో అడుగడుగునా అధికార కాంగ్రెస్ ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు తమ గుండెల్లో గులాబీ జెండా ఉందని నిరూపించారు.
ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ గెలుపొందిన స్థానాల్లో చాలాచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు చివరి వరకు గట్టి పోటీనిచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అధికార బలంతో ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి చాలా గ్రామాల్లో రీ కౌంటింగ్ నిర్వహించారు. చివరి విడతలో పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాలుండగా, వీటిలో 91 జీపీలకు 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 88 జీపీల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించారు.
దేవరుప్పుల మండలంలో మొత్తం 32 జీపీలకు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 17 గెలుచుకొని సత్తాచాటగా, కాంగ్రెస్ మద్దతుదారులు 14 స్థానాల్లో, ఒకచోట స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. కొడకండ్ల మండలంలో 21 జీపీలకు బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 16, స్వతంత్ర అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్నారు. పాలకుర్తి మండలంలోని 38 జీపీల్లో బీఆర్ఎస్ 17, కాంగ్రెస్‌కు 19, స్వతంత్రులకు రెండు సర్పంచ్ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పంచాయతీలకు నయాపైసా నిధులు ఇవ్వకపోవడం, రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులు బారులు తీరడం, పంట నష్ట పరిహారం ఇప్పటికీ అందజేయకపోవడం వంటి వ్యతిరేకతతో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ మద్దతుదారులకు జై కొట్టారు.
అటు రెండో విడతలో జనగామ పల్లె ఓటరు, చివరి విడతలో ఇటు పాలకుర్తి ప్రజలు పదేండ్ల పాలన మరువకుండా బీఆర్ఎస్ మద్దతుదారులను ఆదరించి తమకు కేసీఆర్‌పై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని నిరూపించారు. మరోవైపు బీజేపీ ఖాతా తెరవకపోగా.. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నా.. జనగామ జిల్లాలో రెండు, మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు అత్యధిక గ్రామాల్లో గులాబీ జెండా ఎగురవేయడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.