చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు. ప్రస్తుతం చుక్క నీరు లేక వేసిన నారు, వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కాల్వలకు గోదావరి నీటిని వేడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– జనగామ రూరల్, జూలై17
బోరు బావుల్లో సరిపడా నీరులేక, కాల్వల్లో గోదావరి నీరు విడుదల చేయక, వర్షాలు కురవక అన్నదాత ఆగమవుతున్నాడు. ప్రభుత్వం మీద ఆశతో కాల్వల ద్వారా నీళ్లు వస్తాయని వరిసాగు చేస్తే తీరా చుక్క నీరు రాకుండా పోయింది. ఉన్న బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపో యాయి. జనగామ మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఎండిన పంటలు బీటలు వారి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకొని రైతుల కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు. పెద్దరాంచర్ల గ్రామంలో ఎండిపోయిన పంటలను రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
నాకున్న నాలుగెకరాల్లో నారు పోసిన. ఎకరం మాత్రమే నాటు వేసిన. అయినా నీళ్లులేక ఎండిపోతుంటే బోరు వేసిన. కొద్దిగా నీరు రావడంతో వాటికి పైపులు తెచ్చి పారిద్దామనుకున్నా. బోరు, పైపులకు రూ.1.38 లక్షలు ఖర్చు పెట్టినా సరిపడా నీళ్లు రాక ఎకరం పొలం ఎండిపోతున్నది. ఇప్పటికైనా కాల్వల ద్వారా గోదావరి జలాలతో చెరువులు నింపాలి.
– నామాల శ్రీనివాస్, రైతు, వడ్లకొండ, జనగామ