వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 4: వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. విషజ్వరాలతో బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఓపీ, పదుల సంఖ్యలో ఐపీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజునే నాలుగు డెంగీ కేసులు, 73 మంది విషజ్వరాల బాధితులు ఎంజీఎంలో చేరారు. వైద్యసేవలకు తగిన విధంగా వార్డులు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని బాధితులు పేర్కొంటున్నారు.
కేవలం 20 పడకలతో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడకలు సరిపోక మిగతా విభాగాల వార్డులను సైతం ఫీవర్ బాధితులతో నింపేస్తున్నారు. ఇటీవల జనగామ జిల్లాకు చెందిన 8 ఏండ్ల చిన్నారి విషజ్వరం బారినపడి మృతి చెందినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో ప్రాణనష్టం జరిగితేగాని అధికారులు స్పందించరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గురువారం నాటికి ఎంజీఎంహెచ్లో 30 డెంగీ, 9 మలేరియా, 22 రెస్పిరేటరీ కేసులు, 11 మంది డయేరియా బాధితులు, మరో 139 మంది వివిధ రకాల విషజ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి, మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
35 రోజులు.. 700 మంది బాధితులు
శాయంపేట : శాయంపేట మండలంలో ఇప్పటికే ఇద్దరికి డెంగీ పాజిటివ్ రావడంతో వారిని ఎంజీఎంకు తరలించారు. పంచాయతీల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలారంలో ఆటో డ్రైవర్ జ్వరంతో బాధపడుతుండగా అతడికి వైద్యపరీక్షలు చేయగా డెంగీగా తేలింది. అలాగే నేరేడుపల్లిలో మహిళకు డెంగీ సోకడంతో ఎంజీఎంహెచ్లో చికిత్స పొందుతున్నది. వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్వో ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. గత నెలలో శాయంపేట పీహెచ్సీకి 532 మంది రోగులు రాగా గడిచిన ఐదు రోజుల్లో 175 మంది వచ్చారని, అందరికీ మలేరియా, డెంగీ పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది తెలిపారు.