జనగామ, జూన్ 27 (నమస్తే తెలంగాణ)/వర్ధన్నపేట : వానకాలం సాగు రైతులకు భారంగా మారనున్నది. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు.. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రత్యక్షంగా.. పరోక్షంగా వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇంటిల్లిపాది ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. పంటల సాగు కత్తిమీద సాములా మారుతున్నది. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి. ఎండనక, వాననక కష్టపడుతున్న రైతులకు మిగిలేది అప్పులే. సాగు ఖర్చు బాగా పెరిగింది. వ్యవసాయం చేయాలంటేనే రైతులు జంకే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సాగు సంబురంగా సాగితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరిగోస పడుతున్నారు. సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్ తగిలింది.
కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. పెరిగిన సాగు ఖర్చు.. ఎరువుల ధరలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులపై రూ.45 కోట్ల భారం పడుతున్నది. గ్రామాల్లో పశుసంపద తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గింది. దీంతో రైతులు రసాయన ఎరువులు వాడాల్సిన పరిస్థితి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ దున్నకం, కూలీల రేట్లు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు సైతం సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
దీంతో అన్నదాతలు అడుగడుగునా అవస్థలు పడాల్సి వస్తున్నది. అంతర్జాతీయంగా ముడిపదార్థాల కొరత, రవాణా ఇబ్బందుల వల్ల ఇటీవల మారెట్లో ఎరువుల ధరల్లో మార్పులు వచ్చాయి. యూరియా, డీఏపీ పాత ధరలకే అందుబాటులో ఉండగా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒకో బస్తా (50 కిలోలు)పై సగటున రూ.200 నుంచి రూ. 350 వరకు పెరిగాయి. అంతర్జాతీయ మారెట్లో అమోనియా, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల రవాణా ఖర్చులు ఎకువ కావడంతో కంపెనీలు ధరలు పెంచాయని ప్రభుత్వం చెబుతున్నది. దీనివల్ల రైతులకు ఎకరానికి సగటున రూ.వెయ్యి వరకు అదనపు పెట్టుబడి భారం పడుతున్నది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు గత వానకాలం సీజన్ నుంచి 2026 ప్రస్తుత సీజన్ వరకు మూడు, నాలుగు సార్లు పెరిగాయి. 2026 జూన్ మొదటి వారం (ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో) కంపెనీలు సగటున బస్తాకు రూ. 200 నుంచి రూ. 350 వరకు ధరలను అధికారికంగా సవరించాయి.
యూరియా (45 కిలోల బస్తా) రూ. 266.50 స్థిరంగా ఉన్నా స్థానిక హమాలీ, రవాణా చార్జీలను సాకుగా చూపుతున్న డీలర్లు రూ.300కు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. డీఏపీ (డీఏపీ-50 కిలోల బస్తా) రైతులకు పాత ధర రూ.1,350కే అందుబాటులో ఉంది. ఒక్క జనగామ జిల్లాలోనే అన్ని పంటలు కలిపి 3.77లక్షల ఎకరాల్లో సాగుచేస్తుండగా ప్రధానంగా వరి 2,13,500 ఎకరాలు, పత్తి 1,30,000 ఎకరాలు మక్కజొన్న 13,000 ఎకరాలు, ఉద్యాన, కూరగాయలు 17,500 ఎకరాలు, కంది 2250, నూనె గింజలు 200, ఇతర పంటలు 550 ఎకరాల్లో సాగువుతున్నది. ఆయా పంటల కోసం యూరియా 28,325 మెట్రిక్ టన్నులు, డీఏపీ 7781, ఎస్ఎస్పీ 1401, ఎంఓపీ 4,669, కాంప్లెక్స్ ఎరువులు 18,676 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే వరంగల్ జిల్లాలో సుమారు 2.75లక్షల ఎకరాల్లో వరి, లక్షా 25వేల ఎకరాల్లో పత్తి, మరో 80వేల ఎకరాల్లో మక్కజొన్న, ఇతర ఆహార పంటలను రైతులు సాగు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా రైతులకు 15,700ల మెట్రిక్ టన్నుల డీఏపీ, 14,500ల మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 28వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 41వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
అన్నదాతలు ప్రధానంగా వరి, ఆ తర్వాత రెండో పంటగా పత్తి సాగు చేస్తున్నారు. వరి సాగుకు ఎకరాకు రూ.40వేలు ఖర్చు వస్తుంది. సగటున 23 క్వింటాళ్లు దిగుబడి వస్తున్నది. ప్రభుత్వం కొంటేనే మద్దతు ధర లభిస్తుంది. అప్పుడు రూ.56,143 ఆదాయం వస్తుంది. సొంత భూమి ఉన్న రైతుకు ఖర్చు పోను రూ.16.343 మిగులుతుంది. రైతు కుటుంబం మొత్తం రాత్రి, పగలు తేడా లేకుండా ఆరు నెలలు కష్టపడితే నెలకు రూ 2,723 వేతనం పడుతున్నది. ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తే మిగితేది అప్పు మాత్రమే. గతేడాది కేంద్ర ప్రభుత్వం వరికి రూ.69 పెంచింది. దీంతో క్వింటాలు రూ. 2,369 కాగా 2026-27లో రూ.3 పెంపుతో రూ. 2,441కు పెరిగింది. పెట్టుబడి ఖర్చులతో పోలిస్తే రైతులకు మిగిలేదేమీ లేదు.
పత్తి సాగుకు ఎకరాకు రూ.44,400 ఖర్చు వస్తుంది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. సగటున క్వింటాలుకు రూ. 14.00 కూలీ అవుతుంది. ఏడు క్వింటాళ్లకు రూ.9.800 పత్తి కూలీ, పెట్టుబడి ఖర్చు రూ.34.600 కలిపి మొత్తం రూ 44.400 ఖర్చు వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఏడు క్వింటాళ్లకు రూ.60.669 ఆదాయం వస్తుంది. సొంత భూమి ఉన్న రైతులకు ఖర్చు పోను రూ. 16,269 మిగులుతుంది. సుమారు 8 నెలలు కష్టపడితే రైతు కుటుంబానికి నెలకు రూ. 2,033 ఆదాయం వస్తుంది.
ఎరువులు, విత్తనాల ధరలను సూత్తే ఎవుసం అంటేనే భయమైతాంది. ఇంత ధరలు పెట్టి ఎరువుల బత్తాలు కొని పంట పండిత్తే ఏం లాభం ఉంటది. ఇప్పటికే ఉన్నధరలతోని బత్తాలు కొని ఎవుసం చేత్తె రూపాయి మిగుల్తలేదు. ఇగ ధరలు పెరిగితే బత్తాలు కొని ఎవుసం చేత్తె ఏం మిగులుతది. ఆఖరికి మేమే మిగిలేటట్టు ఉన్నం. ఇగ భూములు ఇడిసిపెట్టి పట్నంపోయి కూలీ పని చేసుకొని బతుకుడే నయమనిపిత్తాంది. ఎవుసం చేసిన ఊల్లె కూలీ పనిచేయలేం. పట్నం పోయి బతుకుడే నయమనిపిత్తాంది.
– గడ్డల ఉప్పలయ్య, రైతు వర్ధన్నపేట
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాన్నుంచి కష్టాలు మొదలైనయి. పోయిన వానకాలం, యాసంగికి యూరియా దొరకక అట్ల కష్టపడ్డం. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిండ్లని దుకాణపోళ్లు చెప్పుతాండ్లు. జీలుగ విత్తనాల బత్తా కేసీఆర్ ప్రభుత్వంల రూ.1124 ఉండె. ఇప్పుడు బత్తా ధర రూ.2137లకు పెరిగింది. ఇప్పటికే పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రైతుబంధు కూడా సరిగా ఇవ్వడంలేదు. పెరిగిన ధరలతోని వ్యవసాయం చేస్తే రైతులకు ఏమీ మిగలదు.
– నాంపెల్లి వెంకన్న, రైతు, వర్ధన్నపేట