ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాపాలన ప్రగతిలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాల్లో శనివారం ఘనంగా జరిగాయి. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రభుత్వ సందేశాన్ని వినిపించారు. దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు జోహార్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఆహార భద్రతకు భరోసా కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో 4,73,271 రేషన్‌కార్డుల్లోని 13,36,126 మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందిస్తున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందకు ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తున్నామని, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో నూతన ఆయుకట్టుతోపాటు ఎన్ఎస్పీ పరిధిలోని రిజర్వాయర్లకు నీరు అందిస్తున్నామని వివరించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులకు ఆధునిక పద్ధతులను అలవర్చి వారు ఆర్థిక పురిపుష్టి సాధించే విధంగా జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో 66,882 మంది విద్యార్థులను నమోదు చేశామన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందన్నారు. జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు వైద్యసేవలను అందించేందుకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ఇల్లు లేని పేదలకు సొంతింటిని కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తోందన్నారు.
జిల్లాకు 16,253 ఇండ్లు మంజూరు చేశామన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. ముందుగా పోలీస్ శాఖ డిప్యూటీ సీఎం గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల కళా ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ కలెక్టర్ పారాస్కుమార్, డీఎఫ్‌వో అనూజ్ అగర్వాల్, ఏడీసీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.