న్యూఢిల్లీ: ప్రభుత్వ డాక్టర్‌పై చేయి చేసుకున్న శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఇవాళ సుప్రీంకోర్టు(Supremecourt) రద్దు చేసింది. మాత్రే బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. తన తీర్పులో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. వైద్య వృత్తిలో ఉన్న వారిపై చేయి చేసుకోరాదని కోర్టు పేర్కొన్నది. డోంబివ్లీలోని శాస్త్రినగర్ మున్సిపల్ ఆస్పత్రిలో జూలై 6వ తేదీన ఓ మహిళా డాక్టర్‌పై శివసేన కార్పొరేటర్ చేయి చేసుకున్నారు. ఓ ప్రెగ్నెంట్‌కు చికిత్స అందించిన కేసులో ఆ కార్పొరేటర్ దరుసుగా ప్రవర్తించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 1832 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
రమేశ్ మాత్రేతో పాటు ప్రమోత్ నికమ్, రమేశ్ పవార్, అక్షయ్ ఖరాండే, సాధానా ఖరాండేపై కేసు బుక్ చేశారు. ఆగస్టు నెలలో బాంబే హైకోర్టు కార్పొరేటర్ రమేశ్‌కు బెయిల్ మంజూరీ చేసింది. గోవాలో గడిపేందుకు అనుమతి కూడా ఇచ్చింది. ఛార్జ్‌షీట్ దాఖలు అయ్యే వరకు మహారాష్ట్ర బయట ఉండాలంటూ బాంబే హైకోర్టు తెలిపింది. అయితే ప్రజలకు సేవ చేసే వారిపై దాడులు చేయడం సరికాదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది.
కార్పొరేటర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదిస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన మహిళా డాక్టర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టనున్నారు. కార్పొరేటర్ మాత్రేపై సుమారు 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 18 కేసుల్లో అతను దోషిగా తేలాడు.