యూట్యూబ్‌లోకి ఈ మధ్యే వచ్చిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘తెల్ల చీర తెల్ల రైక’ కొద్ది రోజుల్లోనే మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్నది. ఆ పాటకు చెట్టు పుట్టల్లో, కొండ కోనల్లో స్టెప్పులేసిన జోడీ నిజంగానే భార్యాభర్తలు. ఇన్‌స్టాలో వీళ్లిద్దరి చూపులు కలిశాయి. యూట్యూబ్‌లో ఈ జోడీ స్టెప్పులూ అదిరాయి. జానపద గీతాలకు స్టెప్పులేస్తూ యూట్యూబ్ స్టార్స్‌గా ఎదిగారు గండి అఖిల్, ప్రియహాసిని. తమ ప్రేమకు ముందురోజుల్లో తీసిన నర్సంపేట మూవీ ముచ్చట్లతో మొదలుపెట్టి ఫోక్ సాంగ్స్ దాకా సాగిన ప్రేమాయణం గురించి అఖిల్ ఇలా పంచుకున్నాడు..
చి న్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్ అంటే మస్త్ ఇష్టముంటుండె. స్కూల్ ఈవెంట్స్‌లో డ్యాన్స్‌లో ఫస్ట్ ప్రైజ్ నాదే. పాపింగ్, హిప్ హాప్, మాస్, ఫోక్ ైస్టెల్స్ని యూట్యూబ్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసిన. వాటన్నిటిని మిక్స్ కొట్టి సినిమా పాటలకు నా ైస్టెల్లో డ్యాన్స్ వేసేవాడిని. కరాటే కూడా నేర్చుకున్న. మా డాడీ లక్ష్మణ్ స్కూల్ టీచర్. అమ్మ రజనీ హోమ్ మేకర్. డ్యాన్స్ చేస్తుంటే మా ఆమ్మానాన్న ఎంతో ప్రోత్సహించారు. ఇంటర్ దాకా మా నర్సంపేటల్నే చదువుకున్నా.

హైదరాబాద్‌లో టీకేఆర్ కాలేజ్‌లో బీటెక్‌లో చేరిన. బీటెక్ చదివేప్పుడు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్‌లో నాలుగేళ్లూ డ్యాన్స్‌లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కాలేజీకి డుమ్మా కొట్టి కరాటే ప్రాక్టీస్ చేసేది. చాలా కాంపిటీషన్స్‌కి పోయిన. మెడల్స్ గెలిచిన. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్, సీనియర్స్ 55 కేజీల కేటగిరిలో గోల్డ్ మెడల్ గెలిచిన. కరాటే కోచ్ కీర్తన్ సార్ నన్ను బాగా ప్రోత్సహించిండు. నేషనల్ సెలక్షన్స్ కోసమని బాగా ప్రాక్టీస్ చేశిన. కరాటేని కెరీర్‌గా మలుచుకోవాలనుకున్న. నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చినంక కొందరు నన్ను నెగల్నియ్యలే. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఆసియా లెవల్ పోటీ సెలక్షన్స్‌కి పోలేదు. పదకొండేళ్లు కష్టపడి ఆ ఫీల్డ్‌ని వదిలేసిన.
మా ఊళ్లోనే సినిమాలు తీసిన కాలేజీకి డుమ్మా కొట్టినా సదువుని పక్కన పెట్టలే. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ సాధించాలనుకున్న. ఇంటర్వ్యూలకు పోయి ‘ఐ టూల్స్ ఇన్ఫో’ కంపెనీలో జాబ్ కొట్టిన. ఏడాది మాత్రమే అందులో పనిచేసిన. నేను చేయాల్సింది ఇది కాదనిపించింది. వెంటనే జాబ్ మానేసిన. అప్పటికే టిక్ టాక్ వచ్చింది. కాలేజ్ డేస్‌లో నేను చేసిన
డ్యాన్స్‌ల వీడియోలు పెడితే మస్త్ చూసేటోళ్లు. అవే వీడియోలు యూట్యూబ్‌లో పెట్టిన. మంచి కథలు రాస్త. కాబట్టి డ్యాన్స్‌లు కాకుండా సినిమా తీయాలనుకున్న.

సొంత ప్రొడక్షన్ పెట్టుకున్న. మా ఊళ్లోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన. ఆర్టిస్టులందరినీ సెట్ చేసుకుని సినిమా తీసిన. మా తమ్ముడు గండి నితిన్‌ని కెమెరామెన్‌గా పెట్టుకున్న. ఐ ఫోన్‌తోనే షూటింగ్ చేసినం. మ్యూజిక్ అంజి పామిడి చేసిండు. నేను, మా తమ్ముడు ఎడిటింగ్ చేసినం. షూటింగ్, ఎడిటింగ్, అన్నీ మా నర్సంపేటలోనే. ‘కాష్మోరా సిరీస్1’ రెడీ అయింది. యూట్యూబ్‌లో Akki_cherry1 చానెల్లో రిలీజ్ చేసిన. అది హిట్ అయింది. ఆ తర్వాత కాష్మోరా సిరీస్‌లో అయిదు ఎపిసోడ్స్ పూర్తి చేసినం. అన్నీ హిట్ అయినయ్. మొదట్లో ఐఫోన్‌తోనే వీడియోలు చేసినం.
మా సినిమాల్లో పాటలు, ఫైట్లు ఉండవు. రెగ్యులర్ సినిమా ప్యాటర్న్ ఫాలో కాలే. ఆడియన్స్‌కి ఒక కథ చెప్పుకొంటూ పోతున్నట్టు స్క్రీన్‌ప్లే చేసినం. జనం ఆదరించారు. కాష్మోరా తర్వాత ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ మొదలుపెట్టిన. ఇది కూడా సక్సెస్ అయింది. ఈ రెండు సిరీస్‌లతో పైసలు సంపాదించి మంచి కెమెరా కొన్న. కొత్త కెమెరాతో ప్రొడక్షన్ వాల్యూస్ ‘శ్వేతనాగు’ సిరీస్ చేస్తున్న. దీనికి మంచి ఆదరణ వస్తున్నది.

సినిమా వాళ్ల దగ్గరకు పోవాలని, సినిమా అవకాశాలు అడగాలనే ఆలోచనే నాకు లేదు. నా ఆలోచనలతో శక్తికి తగ్గ సినిమాలు తీసుకుంటూ పోతున్న. అయితే చిత్రంగా సినిమా వాళ్లే నా దగ్గరకు వచ్చి మా సినిమాలు ప్రమోట్ చేయమన్నరు. సోషల్ మీడియాలో పాపులర్ కావాలని యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్ కోసం మొదట్లో కామెడీ స్కిట్లు చేసినం. సాధారణ జీవితంలో ఉండే కామెడీ సందర్భాలను తీసుకుని వీడియోలు చేస్తూ పోతుంటే అట్లనే సినిమాల మీద షార్ట్స్ చేయమన్నరు. హీరోలతో కలిసి కొన్ని షార్ట్స్ చేసినం. చాలా సినిమాలను ప్రమోట్ చేసినం. ఇక ముందు ఇట్లనే సినిమాలు తీస్త. మ్యూజిక్ ఆల్బమ్‌కి డ్యాన్స్‌లు చేస్త. ఇంకా మంచి వీడియోలు తీయాల్నని హైదరాబాద్ వచ్చిన. ఇక్కడే ఉంట, ఇక్కడే షూటింగ్ చేస్తున్న. ఏమీలేని చోటనే మంచి వీడియోలు తెచ్చిన. ఇక హైదరాబాద్‌లో ఇంతకంటే మంచి వీడియోలు చేస్తం. మ్యూజిక్ ఆల్బమ్స్‌కి డ్యాన్స్‌లు వేస్తం.

నా జీవిత భాగస్వామి ప్రియహాసినిది రాయలసీమ. ఇన్‌స్టాలో పరిచయమైంది. తన బర్త్‌డేకి వాళ్ల అమ్మావాళ్లు హైదరాబాద్ వచ్చి, నన్ను పిలిచారు. అట్ల ఫస్ట్ టైమ్ కలుసుకున్నం. నా రీల్స్ కోసం ఎవరినో ఒకరిని తోడు చేసుకుని డ్యాన్స్ చేసేది. అట్ల ప్రియ హాసినితోనీ కొన్ని పాటలు చేసిన. అలా స్టార్ట్ అయింది మా ప్రయాణం. తర్వాత ఇద్దరం పెండ్లి చేసుకున్నం. నా వల్ల ఆమె టాలెంట్ బయటికి వచ్చింది. మేమిద్దరం కలిసి అయిదు పాటలు చేసినం. రెండు హిట్ అయినయి. రావె రావె బాలామణి, తెల్ల చీర తెల్ల రవిక పాటలు బాగా పాపులర్ అయినయి. ఇట్ల పెద్ద యూట్యూబ్ చానెల్స్ వాళ్లు ఫోక్ మ్యూజిక్ కోసం మా ఇద్దరిని పిలుస్తున్నరు. కామెడీ వీడియోలు బంద్ పెట్టి ఫోక్ సాంగ్స్‌కి డ్యాన్సులేస్తున్నం.
…? నాగవర్ధన్ రాయల