ఏటూరునాగారం, ఏప్రిల్ 18: మారుమూల అటవీ ప్రాంతాల్లో హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు పోడు భూముల సాగు కష్టాలు తప్పడం లేదు. సాగు నీటి వసతి లేక, విద్యుత్ సరఫరా దూరంగా ఉండడం, బోర్లు లేకపోవడం వంటి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అటవీ హక్కు ల చట్టం కింద గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించారు. అయితే అనేక మంది రైతులు ఎంతో కాలంగా తమ భూముల్లో బోర్లు వేయాలని, మోట ర్లు ఇవ్వాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని ఐటీడీఏలో వినతులు అందజేశారు.
గతంలో సీఎం గిరి వికాస్ స్కీంకింద పోడు భూములకు సాగు నీటి వసతి కొంత మేరకు కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 53 వేల మందికి 1.47 లక్షల ఎకరాల పోడు భూమికి పట్టాలు అందజేశారు. అయితే పోడు భూముల్లో సాగు చేస్తుంటే ఒకవైపు అటవీశాఖ అధికారులు అడ్డుకుంటుండగా, సాగు చేసుకునేందుకు కనీస సౌకర్యలు కల్పించాలని రైతులు ఐటీడీఏ చుట్టూ తిరుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఇందిర జల ప్రభ కింద ఐటీడీఏ ద్వారా పలు ప్రాంతాల్లో బోర్లు వేసి వదిలేశారు. వాటికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రైతులు కొంత డబ్బును డీడీ రూపంలో చెల్లించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
గతేడాది ప్రభుత్వం సీఎం గిరి వికాస్ స్కీంను ‘ఇందిర సౌర గిరి జల వికాసం’గా మార్చేసింది. రానున్న ఐదేళ్లలో రూ. 12,600 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా అటవీహక్కుల చట్టం కింద ఉన్న 6.69 లక్షల ఎకరాల పోడు భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సౌర విద్యుత్‌తో కూడిన సాగు నీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకు న్నా.. నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ పథకాన్ని గిరిజన సంక్షేమశాఖ ద్వారా అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి భూగర్భ జల, వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో అమలు చేసేలా రూపకల్పన చేశారు.
కానీ ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోగా, బోర్లు కూడా వేయలేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో విద్యుత్ స రఫరా ఇబ్బందిగా ఉండగా, సౌర వి ద్యుత్ సదుపాయం కల్పించాలని భా వించినా అమలు కావడం లేదు. వాజే డు మండలం లక్ష్మీపురం, గుమ్మడి దొడ్డి, తాడ్వాయి మండలం భూపతిపూర్, ఏటూరునాగారం మండలం అల్లం వారిఘనపూర్, చెల్పాక తదితరర అనేక గ్రామాల గిరిజనులు బోర్లు, విద్యుత్ సౌక ర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం, బోర్ల కోసం మహబూబాబాద్ జిల్లాలో 1,350, ములుగు జిల్లాలో 1,052 దరఖాస్తులు ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రతి సోమవారం ఐటీడీఏలో నిర్వహించే దర్బార్‌కు హాజరై దరఖాస్తులు అందజేస్తూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గిరిజనులు పోడు భూములతో పాటు వారి సొంత భూములను కూడా సాగు చేస్తున్నారు. మొత్తంగా ఎన్ని ఎకరాలు సాగులో ఉందనేది తెలియదు. ఇక అటవీహక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చిన, సొంత భూములు ఏ మేరకు సాగులో ఉన్నాయి? సాగుకు ఎన్ని ఎకరాలు యోగ్యం? ఎన్ని ఎకరాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి? అనే సర్వేను ఐటీడీఏ అధికారులు నేటికీ చేయడం లేదు. కేవలం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ప్రతిపాదనలు తయారు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఇక మాదేమి లేదని బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపించామంటూ కార్యాలయాలకే పరిమితమై కంటి తుడుపు మాటలు చెప్పి పంపిస్తున్నారు. సర్వే చేసి భూములకు సాగు నీటి వసతి కల్పిస్తే పంటల దిగుబడి విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాగా, తాము వేసిన ఆరుతడి పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని, త్రీ ఫేస్ కరెంటు ఇప్పించాలని కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మల్లెల లక్ష్మయ్య వేడుకుంటున్నాడు.