పర్వతగిరి, జూన్ 7: మండలకేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ వద్ద పలువురు దళిత రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రిజర్వాయర్ రెండు తూములకు అధికారులు షెట్టర్లను సరిగా అమర్చకపోవడంతో మూడేళ్ల నుంచి సరిగా పంటలు పండించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తూముల నుంచి 24 గంటలపాటు నీరు బయటకు వచ్చి పంట పొలాల మీదుగా పారుతోందన్నారు. దీంతో భూములు జాలువారి పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
సుమారు 50 ఎకరాల్లో ఏటా పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు బొట్ల వెంకన్న, అర్షం జయమ్మ, కాసర్ల ప్రభాకర్, బొట్ల పుష్పమ్మ, సింగారపు యాకయ్య, చేరాలు, దర్గయ్య, కనుకరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. షెట్టర్లను సరిచేసి వానకాలం సాగుకు సహకరించాలని అధికారులను కోరారు. అంతేకాకుండా తూము నుంచి పోలకమ్మ చెరువు వరకు సీసీ వేసి కాల్వ నిర్మాణం చేపట్టాలని కోరారు.